March 7, 2013

వీరభద్రారెడ్డి మరణంపై విచారణ జరపాలి : చంద్రబాబు

అసెంబ్లీలో చాకచక్యంగా వ్యవహరించాలి
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ మధ్యే పోటీ

త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చాకచక్యంగా వ్యవహరించాలని, ప్రతి నిముషాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మొహమాటం లేకుండా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన చెప్పారు.

'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ముదినేపల్లి మండలం, దాకారంలో ఆపార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న 50 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ట్రాప్‌లో పడకుండా అసెంబ్లీలో చాకచక్యంగా వ్యవహరించాలన్నారు ఈ ఏడాది ఎన్నికల ఏడాది కాబట్టి అసెంబ్లీలో మనదే పైచేయి కావాలని బాబు ఎమ్మెల్యేలకు సూచించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్, విద్యుత్ సమస్యలు, బాంబు పేలుళ్ల సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చంద్రబాబు నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెసు మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. వీరభద్రా రెడ్డి మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేయాలని బాబు సూచించారు. అనిల్ కుమార్ ఏ భార్యపై ప్రమాణం చేస్తారో డిమాండ్ చేయాలని, కొందరు ఎమ్మెల్యేల తీరు తాళి కట్టేది ఒకరితో కాపురం మరొకరితో అన్నట్లుగా ఉందని, వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని, వారు ప్రజలచే తిరస్కరించబడతారని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ పార్టీ కాంగ్రెసుకు మద్దతు పలికిందని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గుర్తుచేశారు. అవిశ్వాసం పెడితే వారు ప్రభుత్వాన్ని కూల్చుతారనే నమ్మకం లేదని, ఆ పార్టీయే అవిశ్వాసం పెడితే డ్రామాలు ఎవరివో తెలుస్తాయన్నారు. ఈ సమావేశం రెండున్నర గంటల పాటు సాగింది. శాసనమండలిలో, శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై బాబు వారికి దిశానిర్దేశనం చేశారు.