March 7, 2013

మూడు సీట్లకు వంద దరఖాస్తులు..

టీడీపీలో 'ఎమ్మెల్సీ' వేడి!
చంద్రబాబును కలిసి విజ్ఞప్తులు
9న పార్టీ పొలిట్ బ్యూరోలో నిర్ణయం!

ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు గడువు సమీపిస్తున్న కొద్దీ టీడీపీలో ఆశావహుల ప్రయత్నాలు వేడి పెంచుతున్నాయి. పార్టీ గెలుచుకోవడానికి అవకాశమున్న మూడు సీట్ల కోసం ఇప్పటికే సుమారు వంద మంది నేతలు చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో అభ్యర్థుల ఎంపిక చంద్రబాబుకు కూడా క్లిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు నాలుగు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండగా.. చంద్రబాబుకు ఇంకా వినతులు అందుతూనే ఉన్నాయి.

గుంటూరుజిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందు సాంబశివరావు తాజాగా ఎమ్మెల్సీ పదవి కోసం చంద్రబాబుకు వినతిపత్రం పంపారు. కాపు సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వడం పార్టీకి ఉపకరిస్తుందని.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీని వీడినందున తన ఎంపిక ఆ లోటును భర్తీ చేస్తుందని ఆయన చెప్పారు. మండలిలో ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావుకు మళ్లీ అవకాశం వస్తుందా లేదా అన్నదానిపైనే కోస్తా నుంచి ఇతరుల పేర్ల పరిశీలన ఆధారపడి ఉంది. ఆయనను ఎంపీగా నిలపాలని చంద్రబాబు భావిస్తే మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవచ్చునని అంటున్నారు.

దాడి మాత్రం ఎమ్మెల్సీగా కొనసాగింపునే కోరుకొంటున్నారు. ఆయన కాని పక్షంలో ఆ ప్రాంతం నుంచి టీడీ జనార్దనరావు, పంచుమర్తి అనురాధ, ప్రతిభా భారతి పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఒక మహిళా నేతకు అవకాశం ఇవ్వాలని అనుకొంటే మిగిలిన సమీకరణాలతో సంబంధం లేకుండా అనురాధ, ప్రతిభా భారతి పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర నుంచి దాడి ఎంపిక జరిగితే ప్రతిభాభారతి పేరు వెనక్కు వెళ్లిపోవచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే.. తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మైనారిటీలకు అవకాశం ఇవ్వదలిస్తే వక్ఫ్‌బోర్డు మాజీ అధ్యక్షుడు సలీం.. రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేంద్రరెడ్డికి చాన్స్ రావడం ఖాయమని అంటున్నారు. మరోవైపు పద్నాలుగేళ్లుగా పార్టీ మీడియా విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఎల్‌వీఎస్ఆర్‌కే ప్రసాద్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నగర నేత కొమ్మినేని వికాస్ ఇటీవల చంద్రబాబును కలిసి ఈ సారైనా తనకు అవకాశమివ్వాలని కోరారు. కానీ, ఈసారి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు ఆయనతో అన్నట్లు సమాచారం. ఇక రాయలసీమ నుంచి బీసీ నేత కాల్వ శ్రీనివాసులు, ఎస్సీ వర్గాలకు చెందిన మహిళ శమంతక మణి కూడా రేసులో ఉన్నారు.

ఈ నెల 9న జరిగే పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో దీనిపై చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిర్ణయం నామినేషన్ల తుది గడువు రోజు వెలువడవచ్చని అంటున్నారు. కాగా.. ఎమ్మెల్సీ సీటుపై సీపీఐ దృష్టిపెట్టింది. ప్రస్తుతం మండలిలో పార్టీ నేత జల్లి విల్సన్ రిటైర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ స్థానానికి తిరిగి తమ పార్టీ అభ్యర్థినే బలపరచాలని టీడీపీని కోరే యోచనలో సీపీఐ ఉంది. మరోవైపు.. సీపీఐకి సభలో తగినంత బలం లేకున్నా ఆ పార్టీకి చెందిన పీజే చంద్రశేఖర్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి గతంలో టీడీపీ సహకారం అందించింది. మళ్లీ మరో స్థానం కోరడం ఎంతవరకు సరైనదన్న చర్చ కూడా నడుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధానాన్ని అనుసరించాలన్న దానిపై ఈ నెల 8 నుంచి జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో సీపీఐ ఒక నిర్ణయానికి రానుంది.