March 7, 2013

నీటి లోంచి బయటపడిన చేపలు

నా 30 ఏళ్ల రాజకీయ జీవితం ఒక ఎత్తు. ఈ 150 రోజుల పాదయాత్ర ఒక ఎత్తు. ఈ యాత్ర నాకు అనేక అనుభవాలను నేర్పుతోంది. ఆర్థిక సంస్కరణల తర్వాత కూడా క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలు, కడగండ్లలో ఏమాత్రం మార్పు లేకపోవడాన్ని కళ్లారా చూస్తున్నా. కానుకొల్లు, లింగాల, పెరికిగూడెం ప్రాంతాలన్నీ ఆకుపచ్చ చీర కట్టినట్టు.. పచ్చటి కొబ్బరి తోటల మధ్య ఉన్నాయి. కానీ, ఇక్కడి జనం జీవితాలు మాత్రం ఎండిన కొబ్బరి చెట్టులా జీవం కోల్పోయాయి. ఒకప్పుడు ఇక్కడ చేపలు, రొయ్యల చెరువులు విరివిగా ఉండేవి.

వేల మందికి అవే ఉపాధి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేపలు, రొయ్యల చెరువులపై బతికేవారు. ఎగుమతులతో పెద్దఎత్తున విదేశీ మారక ద్రవ్యమూ వచ్చేది. ఇప్పుడు కూడా అక్కడక్కడా చెరువులు కనిపిస్తున్నా.. గత వైభవం మాత్రం లేదు. అప్పట్లో చేపలు, రొయ్యల చెరువుల వ్యాపారం చేసిన రైతులంతా ఇప్పుడు నీటిలోంచి బయటపడిన చేపల్లా గిలగిలలాడుతున్నారు. వారి జీవితాలూ అస్తవ్యస్తం అయిపోయాయి. దీనంతటికీ కారణం పాలకుల విధానాలే. ఈ వ్యాపారాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది.

వ్యవసాయానికి, వ్యాపారానికి ప్రభుత్వం నుంచి ఏమాత్రం చేయూత లేదని ఇక్కడి వారు ఆరోపిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి పొట్ట చేతపట్టుకుని ఇక్కడికి వలస వచ్చి రొయ్యల చెరువులపై ఉపాధి పొందినవారు ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఇప్పుడు ఆ భూముల్లో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. చేపలు, రొయ్యల సాగు చేసే పరిస్థితీ లేదు. ఇప్పుడు ఇక్కడి భూములతోపాటు రైతులు కూడా రెంటికి చెడ్డ రేవడిలా మారారు. అటు వ్యవసాయం చేయలేక, ఇటు చేపలు పెంచి వ్యాపారమూ చేయలేక చిన్న రైతులు చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు.