March 7, 2013

బాబూ..నువ్వే కావాలి..

పక్కా ఇళ్ళ నిర్మాణం అటకెక్కింది... పింఛన్లు ఇవ్వకుండా వంచిస్తున్నారు... సంక్షేమ పథకాలు పేదలకు చేరడం లేదు... టీడీపీ హయాంలో ప్రజల వద్దకు పాలన వస్తే ఇప్పుడు అధికారుల వద్దకు వెళ్ళినా వారు అందుబాటులో ఉండటం లేదంటూ పాదయాత్రలో మహిళలు గ్రామగ్రామాన తమ గోడు వెళ్ళబోసుకున్నారు.

ముదినేపల్లి: వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముదినేపల్లి మండలంలో నిర్వహించిన పాదయాత్రలో ప్రజలు అడుగడుగునా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పెదపాలపర్రు నుంచి దాకరం వరకు నిర్వహించిన పాదయాత్రలో గ్రామగ్రామాన ప్రజలు సమస్యలతోనే స్వాగతం పలికారు. పలుచోట్ల మహిళలు, వృద్ధులు చంద్రబాబు మీరు అధికారంలోకి వస్తేనే మా కష్టాలు తీరుతాయంటూ మొరపెట్టుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలు సక్రమంగా, సజావుగా పేదలకు చేరడం లేదని, చాలా చోట్ల టీడీపీ అభిమానులకు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పెదపాలపర్రు గ్రామం వద్ద వందల సంఖ్యలో గుమిగూడిన మహిళలు, వృద్ధులు తమకు పింఛన్లు కూడా సకాలంలో అందడం లేదని, పక్కా గృహాల నిర్మాణం నిలిచి పోయిందని గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని పథకాలు సకాలంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవని, ఇప్పుడు చిన్న చిన్న పనులకు సయితం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నామని పలువురు వృద్ధులు చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మీ హయాంలో పాలన ప్రజల వద్దకే వచ్చిందని, ఇప్పుడు అధికారుల వద్దకు తాము వెళ్ళినా అందుబాటులో ఉండటం లేదని తెలిపారు. రైతులు కూడా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబుకు వివరించారు.

అధైర్య పడకండి! మరో సంవత్సరం ఓపిక పట్టి, రాబోయే శాసనసభ ఎన్నికల రోజున ఒక్కరోజు మాకు అవకాశం ఇవ్వండి, మీ సేవకుడిగా, మీ ఇంట పెద్ద కొడుకుగా మీ బాగోగులు చూసుకుంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పెదపాలపర్రు గ్రామం దాటిన తరువాత జాతీయ రహదారి కుంగిపోయి ప్రమాదకరంగా ఉన్న దుస్థితిని చూసి చంద్రబాబు మన హయాంలో నిర్మించిన రోడ్లు అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కలవపూడి సత్రం వద్ద పలు గ్రామాల ప్రజలు తమసమస్యలను ఏకరవు పెట్టి మీ పాలన రావాలని మేము కోరుకుంటున్నామని చంద్రబాబును ఆశీర్వాదించారు. చినపాలపర్రు గ్రామం రోడ్డు వద్ద ప్రజలు తమ రోడ్డు దుస్థితిని వివరిస్తూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలరాజ్ మేజర్ డ్రైన్ ఆధునికీకరణ పనులు నామమాత్రంగానే చేసిన విషయాన్ని పలువురు రైతులు చంద్రబాబుకు చూపించారు.

ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, టీడీపీ జిల్లా కార్యదర్శి ఈడ్పుగంటి వెంకట్రామయ్య, జిల్లా తెలుగు రైతు కార్యదర్శి చలసాని జగన్మోహనరావు, పార్టీ మండల అధ్యక్షుడు కొట్టూరి విఠల్ తదితరులు చంద్రబాబుకు వివిధ సమస్యలను వివరించారు. ఈ పర్యటనలో ఎంపిీ కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, మాజీ శాసనసభ్యులు కాగిత వెంకట్రావు, రావి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ గద్దే రామ్మోహన్, విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ పాల్గొన్నారు.