March 7, 2013

పాల వాసనొస్తారా.. పగ్గాలు తీసుకుంటారా?

'పక్కన నిలబడితే పాల వాసనొస్తారు..' - నరనరానా టీడీపీ రక్తం ప్రవహిస్తున్న ఓ అరవయ్యేళ్లు పైబడ్డ కార్యకర్త నారా లోకేష్ గురించి వెలువరించిన అభిప్రాయమిది. 25 ఏళ్లనుంచి కుప్పం టీడీపీ రాజకీయాల్లో పండిపోయిన ఆయన తాను నాయకుణ్ణనే చెప్పుకుంటారు కానీ, సాధారణ కార్యకర్తగానే జీవిస్తున్నారు. మరి మూడురోజుల పాటు కుప్పం పర్యటన చేయనున్న లోకేష్, ఆ కార్యకర్త భావిస్తున్నట్టు పాల వాసనొస్తారా, పగ్గాలు తీసుకుని పార్టీని రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయపథంలో నడిపిస్తారా అన్న ఉత్కంఠ కుప్పంలో సర్వత్రా నెలకొంది.

ఎప్పుడో 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచార సందర్భంగా తండ్రి చంద్రబాబుకు మారుగా లోకేష్ కుప్పంలో పర్యటించారు. మళ్లీ మొన్న ఫిబ్రవరి 22న ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికొచ్చి ఇక్కడి టీడీపీ శ్రేణులపై ఆగ్రహా వేశాలు వ్యక్తం చేసి హడలెత్తించారు. ఆయనప్పట్లోనే ప్రకటించినట్లు ఈనెల 7, 8, 9 తేదీల్లో అటు వి.కోటలోను, ఇటు కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ పర్యటించనున్నారు. ప్రధానంగా యువతపైనే తన పర్యటన మొత్తాన్ని కేంద్రీకరించారు లోకేష్. ఆ మేరకే పకడ్బందీగా పర్యటన కార్యక్రమాన్ని స్థానిక యంత్రాంగంచేత ఖరారు చేయించారు. మొత్తం ఐదు మండలాల్లో ప్రతిచోటా ఆయన యువతతో సమావేశమవుతున్నా రు. అలాగే మహిళలు, మైనారిటీలనూ మరచి పోలేదు.మధ్యలో ఒకట్రెండు పల్లెలనూ చుట్టబెట్టను న్నారు. ఇంత హఠాత్తుగా కుప్పం పర్యటించాలన్న ఆలోచన లేదా నిర్ణయం లోకేష్ ఎందుకు తీసుకున్నా రో ఇతమిద్దంగా తెలియకపోయినా, స్థానిక టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపాలన్న ఉద్దేశం ఆయన లక్ష్యంలో స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ ఉనికితో కుప్పంలో కాంగ్రెస్ పూర్తిగా డీలా పడింది. ఆ పార్టీ తరఫునుంచి నాయక శ్రేణిని కానీ, కార్యకర్తల యంత్రాంగాన్ని కానీ ఉత్తేజితం చేసే కార్యక్రమాలేవీ ఉన్నత స్థాయి నాయకత్వం చేపట్టకపోవడం అది మరింత బలహీన పడడానికి దోహదం చేసింది. రెండు దఫాలుగా అధికారంలో లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ యంత్రాంగం కూడా ఒకింత నిస్తేజంగానే తయారైంది.ఇతర నియోజకవర్గాలైతే ఇదంతగా పట్టించుకోదగ్గ అంశం కాకపోవచ్చు. అయితే కుప్పం స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు సారథ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఏ ఎన్నికల్లోనైనా సరే.. కుప్పంలో ఒకింత మెజారిటీ తగ్గినా వెంటనే చంద్రబాబు నాయకత్వాన్నే ప్రతి పక్షాలు వేలెత్తి చూపుతాయి.అది రాష్ట్రంలో అధికా రంలోకి రావాలనుకుంటున్న అధినేతకు చెరుపు చేసే అంశమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్ర బాబు తన తనయుడైన లోకేష్‌కు కుప్పం నియోజక వర్గ బాధ్యతలు అప్పగించినట్లు కనిపిస్తోంది. అయితే లోకేష్ ఇక్కడి నాయకత్వంతో, కార్యకర్తలతో నెట్టుకు రాగలరా అన్నది ఆలోచించాల్సిన అంశం. మొన్న జరిపిన ప్రైవేటు పర్యటనలో ఆయన నియోజకవర్గ సరిహద్దుల్లో అడుగు పెట్టీపెట్టగానే తనను స్వాగతించబోయిన స్థానిక నాయకులపై విరుచుకు పడ్డారు. ఆయన ఆయన ఆగ్రహం నాయకత్వంపైనా, కార్యకర్తలమీదా అన్నది ఎవరికీ అర్థం కాలేదు. దీంతో సీనియర్ నాయకులనుంచి కిందిస్థాయి కార్యకర్తలు కూడా లోకేష్ వ్యవహార శైలికి నొచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంలోనే 'పక్కన నిలబడితే పాల వాసనొస్తార'న్న వ్యాఖ్యానం సగటు కార్య కర్తనుంచి వెలువడింది. చంద్రబాబు పార్టీ అధినేత కాబట్టి ఆయనెంత ఆగ్రహించినా, కసిరి పొమ్మన్నా.. నాయకులు, కార్యకర్తలు అనుకునేందుకేమీ ఉండదు. కానీ, రాకరాక నియోజకవర్గానికి వచ్చిన లోకేష్ నుంచి ఆగ్రహావేశాలు ఎదుర్కోవాల్సి రావడం టీడీపీ శ్రేణుల్లో ఎవ్వరికీ మింగుడు పడడంలేదు. మూడు రోజులపాటు జరుగనున్న పర్యటనలో సైతం లోకేష్ అదేవిధంగా వ్యవహరిస్తే పరిస్థితులు ఎదురు తిరిగే ప్రమాదం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాకాకుండా సౌమ్యంగా, స్పష్టమైన లక్ష్యంతో దిశానిర్దేశం చేస్తేనే లోకేష్ పర్యటనకు అర్థం, పరమార్థం ఏర్పడుతుందని, అప్పుడే స్థానిక ఎన్నికల లక్ష్య ఛేదన సాధ్యమవుతుందని విశ్లేషిస్తున్నారు.