March 7, 2013

బాబ్లీపై టీడీపీ ఆందోళన

నిజామాబాద్: బాబ్లీ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ జిల్లాలో పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించారు. బాబ్లీ ప్రాజెక్ట్‌పై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలను వినిపించలేదని, బాబ్లీ మూలంగా తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆరోపిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను చేపట్టారు. డిచ్‌పల్లి, సిరికొండ, ధర్పల్లిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఆర్మూర్ కెనాల్ బ్రిడ్జిపై టీడీపీ కార్యకర్తలు రాస్తారోకో చేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వేల్పూర్, కమ్మర్‌పల్లిలో 63వ జాతీయరహదారిపై, నందిపేట్ మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు.

జక్రాన్‌పల్లిలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించగా, బాబ్లీపై రివ్యూ పిటీషన్ వేయాలని బాల్కొండలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్, నవీపేట్, వర్ని మండలాల్లోబాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆందోళనలు కొనసాగాయి. రెంజల్‌లో టీడీపీ నాయకులు బాబ్లీ ప్రాజెక్టును కూల్చివేయాలని రాస్తారోకో నిర్వహించగా, నవీపేట్, వర్నిలో రాస్తారోకో చేశారు. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో, జుక్కల్‌లో రాస్తారోకో చేయగా, కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తాలో, మాచారెడ్డి చౌరస్తాలో టీడీపీ నేతలు రాస్తారోకో చేశారు. రాస్తారోకో మూలంగా రోడ్లకిరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.