April 21, 2013

అన్‌రాక్ మెడ వంచైనా రైతులకు న్యాయం చేస్తా

మాకవరపాలెం/కొయ్యూరు
: అక్రమ అనుమతులతో నిర్మించిన అన్‌రాక్ కంపెనీ యాజమాన్య మెడలు వంచైనా ఈప్రాంత రైతాంగానికి, కూలీలకు న్యాయం చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా  సాయంత్రం మాకవరపాలెం మండలం కొత్తపాలెం పునరావాస కాలనీ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అన్‌రాక్ కంపెనీ స్థాపన కోసం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఇటు రైతులు, అటు గిరిజన సంపదను దోచుకున్నారన్నారు.

లక్షలు విలువ చేసే భూములను ఎకరానికి మూడు నాలుగు లక్షలు వెచ్చించి పేద రైతాంగాన్ని అన్యాయం చేశారన్నారు. భూములు లీజుకు తీసుకొనే సమయంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఈప్రాంత రైతాంగం నుంచి మూడు వేల ఎకరాలు తీసుకోవడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడేటట్టు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. అలాగే రామన్నపాలెం సభలో మాట్లాడుతూ రామన్నపాలెం రైతాంగం సాగునీటి అవరాలు కోసం టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తే ఆ నీటిని అన్‌రాక్ కంపెనీ లాక్కొని ఈప్రాంత భూములు బీడువారే పరిస్థితి ప్రభుత్వం తెప్పిస్తుందన్నారు. తాను అధికారంలోకి వస్తే ఈ ప్రాంత బి.ఫారం పట్టాలకు శాశ్వత పట్టాదారుపాసుపుస్తకాలు భూయాజమాన్య హక్కు పత్రాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. పిల్లల చదువులకు ఉపయోగపడేలా ప్రతీనెలా నగదు అందజేస్తానని ప్రకటించారు.