April 21, 2013

గెలుపు మనదే


 ఏలూరు: 'ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారు. మనం మరింత చేరువ కావాలి. ఇది అంతిమ పోరాటం. వచ్చే ఎన్నికల్లో అధికారమే ప్రధానంగా అటో ఇటో తేల్చుకుందాం. మనమే ప్రజల దగ్గరకు వెళ్లాలి. సమస్యలపై దండెత్తాలి. కరెంటు సమస్య, తాగునీటి సమస్యను ఎక్కడా వదిలివేయొద్దు. పోరాటాలకు దిగండి. అలాగే ఈ నెల 27న చంద్రబాబు పాదయాత్ర ముగింపునాడు జరిగే సభే వచ్చే ఎన్నికలకు నాందిగా అందరూ కదిలిరండి' ఇదీ తెలుగుదేశం ముఖ్యనేతలు తమ పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.

మనం మాత్రం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్ర కారణంగా మన పార్టీ ఎంతో పుంజుకుంది. అయినా మనం దీంతో సంతృప్తి చెందకూడదు. మరింతగా జనం మధ్య దూసుకుపోవాలి. కాంగ్రెస్‌ను ఎండగట్టాలి. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ల ఓటమికి, తెలుగుదేశం గెలుపునకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని కూడా నాయకులు పిలుపునిచ్చారు. తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లోపాలను సరిదిద్దుకుందాం. ప్రజలతో వెళ్తేనే మనం గట్టెక్కుతాం. వై ఎస్సార్ కాంగ్రెస్ ఎప్పుడో దిగజారిపోయింది. జనం మన వైపు చూస్తున్నారు. ఈసారి గెలుపు మనదే కావాలి. అందుకే ప్రతీ కార్యకర్త, నాయకుడు ఈ సమరోత్సాహంతో ముందుకురకాలని పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చియ్యచౌదరి పిలుపునిచ్చారు.

నియోజకవర్గాల వారీగా వచ్చే జూన్‌లో పార్టీ అధినేత మరోసారి సమీక్ష చేయబోతున్నారు. దీనికి కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న విశాఖపట్నంలో జరిగే చంద్రబాబు పాదయాత్ర ముగింపుసభకు భారీగా తరలివెళ్లాలని కూడా విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికలు మనకు కొత్త భవిష్యత్‌ను అందించబోతున్నాయి. ఇప్పటి నుంచే మనం ప్రజా సమస్యలపై పోరాడుతూనే వారి అండదండలను అందిపుచ్చుకోవాలి. ఈ విషయంలో అందరూ సమాన బాధ్యత వహించాలని పార్టీ పరిశీలకులు కాగిత వెంకట్రావు కోరా రు. జిల్లా నుంచి కనీసం లక్ష మంది విశాఖకు తరలివెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా ఖర్చుపెట్టుకున్నాం. ఇబ్బందులు ఉన్నాయి. అయినా వీటిని అధిగమించి అయినాసరే పార్టీ కోసం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని కాగిత అన్నారు. పార్టీ కోసం ఏదైనా చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. పాదయాత్ర విజయవంతమైంది. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖలో జరిగే సభను కూడా విజయవంతం చేద్దాం. దీనికి అందరూ కలిసి రావాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల విషయంలో మనం ఇప్పటికే పోరాడుతూనే ఉన్నాం. ప్రజలు కూడా తెలుగుదేశం అధికారంలోకి రావాలని ఎదురుచూస్తున్నారు. ఇలాం టి అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే శివరామరాజు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ అట్టర్ ప్లాప్ అయ్యారు. అవినీతి రాజ్యమేలుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని మనం గెలిపించుకునేందుకు మంచి అవకాశాలు చెంతనే ఉన్నాయని ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు పేర్కొన్నారు. పార్టీలో కష్టించి పనిచేసేవారిని గుర్తించాలి. ఆ మేరకే అభ్యర్థులను నిర్ణయిస్తే గెలుపు సులభమవుతుందని వీరయ్యచౌదరి అభిప్రాయపడ్డారు. మోటారు ఫీల్డ్‌లో పనిచేసేవారికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రాము కోరారు. జిల్లా కమిటీ ఏర్పాటు
లో జాప్యం ఏ మాత్రం సరికాదని బాబ్జీ అభిప్రాయపడ్డారు. పార్టీ విజయం కోసం నిర్విరామంగా పనిచేసేందుకు అందరం సిద్ధంగానే ఉన్నామని సీనియర్ నేత దాలయ్య పేర్కొన్నారు. అంతకుముందు చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం సందర్భంగా కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బూరుగుపల్లి శేషారావు, కన్వీనర్లు అంబికా కృష్ణ, గన్ని వీరాంజనేయులు, డాక్టర్ బాబ్జి, ముళ్లపూడి బాపిరాజు, కారుపాటి వివేకానంద్, కొక్కిరిగడ్డ జయరాజు, ముడియం శ్రీను, జగ్గారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్‌బాబు, బి.కరుణకుమార్, పెనుమర్తి రామ్‌కుమార్, రాధ, నందిన హరిశ్చంద్రప్రసాద్, సరళాదేవి పాల్గొన్నారు.