April 21, 2013

చంద్రబాబు ఆశయాలు మహోన్నతం

కైకలూరురూరల్: ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు 200 రోజులుగా సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఆశయాలు మహోన్నతమైనవని ఎమ్మెల్యే జయమంగళ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను శనివారం కైకలూరులోని మాగంటి స్వగృహంలో అట్లూరి భవానీప్రసాద్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య నిర్వహించారు. ఢిల్లీలో ఐదు సంవత్సరాల బాలికపై అత్యాచారం జరగడం, రాష్ట్ర ప్రజలు కరెంట్, నీరు, తదితర సమస్యల్లో బాధపడుతున్నందున పుట్టినరోజు వేడుకలను చేయవద్దని చంద్రబాబు సూచించారని తెలిపారు.

కాని 20 రోజులుగా పుట్టినరోజు వేడుక పనులను నిర్వహించడం వలన జరపక తప్పలేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ ఉపాధ్యక్షుడు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణలు చంద్రబాబుకు 63 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 63 కేజీల కేక్‌ను కట్ చేశారు. హిందు, ముస్లిం, క్రైస్తవ మత గురువులు ప్రత్యేక పూజలను, ప్రార్థనలను నిర్వహించారు. మాగంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వెంటనే కొల్లేరుకు పూర్వపు వైభవం తీసుకువస్తామని అన్నారు. బాంబులతో చెరువులను ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు జీవనాధారం చూపించలేకపోయిందని తెలిపారు.

ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, రాష్ట్ర వైద్యవిభాగం అధ్యక్షుడు డాక్టర్ సీఎల్.వెంకట్రావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ, పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎంపీపీ నర్శిపల్లి అప్పారావు, ఏబీసీ ట్రస్ట్ అధ్యక్షుడు అట్లూరి భవానీ ప్రసాద్, ఈడ్పుగంటి వెంకటరామయ్య, చల్లసాని జగన్మోహనరావు, పోసిన పాపారావు తదితరులు పాల్గొన్నారు.