April 21, 2013

వైఎస్ కుటుంబం చుట్టూనే అవినీతి మూలాలు

విశాఖపట్నం: రాష్ట్రంలో తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అవినీతికి సంబంధించి మూలాలు వెతుకుంటే వైఎస్ కుటుంబం చుట్టే తిరుగుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా మాకరపాలెం మండలం చెట్టుపాలెంలో
రాత్రి ప్రజలనుద్ధేశించి మాట్లాడుతూ, అవినీతి అక్రమాలపై దర్యాప్తుచేస్తున్న సంస్థలు ఏ ఫైలు వెదికినా, ఎవర్ని విచారించినా వైఎస్, అతని కుమారుడితో సంబంధాలు వెలుగుచూస్తున్నాయని ఆరోపించారు.

సూట్ కేసులతో రాజకీయం చేయాలని చూసిన జగన్, అవినీతి ఆరోపణలతో జైలుకుపోయారని వ్యాఖ్యానించారు. తనను కావాలనే జైలులో వుంచారని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తప్పుచేసిన వ్యక్తి జైలులో కాకుండా ఇంకెక్కడ వుంటారని ప్రశ్నించారు. చివరకు కోర్టులు కూడా బెయిల్ ఇవ్వలేని స్థితికి వచ్చాయంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుందని పేర్కొన్నారు.

దొంగలను దొంగగానే చూడాలి తప్ప దొరల్లా చూడకూదదని చంద్రబాబు స్పష్టంచేశారు.

దేశంలో ఏ రాష్ట్రం సాధించలేనిఐ అభివృద్ధి ఫలితాలను తమ హయాంలో చూపించామని, అమెరికా వంటి పలు దేశాల అధ్యక్షుల మన్ననలు పొందామని, ప్రపంచ పటంలో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు తెచ్చామన్నారు. కాంగ్రెస్ నాయకులు గడచిన తొమ్మిదేళ్లలో హద్దుల్లేని అవినీతికి పాల్పడడం ద్వారా హైదరాబాద్‌కు చెడ్డ పేరు తెచ్చారని వ్యాఖ్యానించారు. అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తులతో యుగపురుషుడు ఎన్టీఆర్ ఫొటూ పెట్టడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆరోపించారు.