April 21, 2013

వర్షాన్ని లెక్కచేయని అభిమానం


కశింకోట : ఒకపక్క భోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా తమ ప్రియతమ నేతను చూసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఎదురు చూశారు. కశింకోట మండలం పాతకన్నూరుపాలేనికి శుక్రవారం రాత్రి చంద్రబాబు చేరుకున్న విషయం తెలిసిందే. అప్పటికే అక్కడకు చేరుకున్న ప్రజలు బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతామని ఎదురుచూశారు. ఢిల్లీ ఘటనకు నిరసనగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు ఆసక్తి చూపకపోవడంతో వారంతా కాసంత నిరాశ చెందారు. అయినా బాబును చూద్దామని క్యూ కట్టారు. శనివారం ఉదయం కూడా జిల్లా నలుమూలలతోపాటు ఇతర జిల్లాల నుంచి పెద్దస్థాయిలో ముఖ్యనేతలు, అభిమానులు తరలివచ్చారు.

ఉదయం 11.15 గంటలకు బోరున వర్షం కురిసింది. గంటకు పైగా వర్షం కురియడంతో బాబు బస చేసిన ప్రాంతమంతా జలమయమైంది. వర్షం పూర్తిగా తగ్గేవరకూ ముఖ్యనేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు వేచి ఉన్నారు. ఇంకొందరు వర్షంలో తడుచుకుంటూనే అక్కడకు చేరుకున్నారు. పన్నెండుగంటల సమయంలో చంద్రబాబునాయుడు బస్సులో నుంచి బయటకు వచ్చారు. శుభాకాంక్షలు అందుకొని అభివాదం చేశారు.

కూలిన టెంట్లు..

చంద్రబాబునాయుడు బస చేసిన ప్రాంతంలో ఈదురుగాలులతో వర్షం కురియడంతో

ఉన్నఫలంగా టెంట్ కూలిపోవడంతో వారంతా పరుగులు తీశారు. సభా ప్రాంగణమంతా తడిసి చిత్తడిచిత్తడిగా మారింది. దీంతో చంద్రబాబు బస్సు వద్దకు చేరుకోవడానికి ప్రజలు, నాయకులు ఇబ్బంది పడ్డారు. జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు రత్నాకర్ ఆధ్వర్యంలో అప్పటికప్పుడు చంద్రబాబు బస చేసిన ప్రాంతంలో ఇసుక వేసి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూశారు.
ఆ ప్రాంగణంలో వున్న టెంట్లు కుప్పకూలాయి. చంద్రబాబు బస చేసిన బస్సుపై వేసిన టెంట్ కూడా కూలింది. ఆ సమయంలో చాలామంది తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు చంద్రబాబు రాకకోసం ఎదురు చూస్తున్నారు.