April 21, 2013

చంద్రబాబుకు నీరాజనం

విశాఖపట్నం/కశింకోట:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అనకాపల్లి నియోజకవర్గంలో అపూర్వ ఆదరణ లభించింది. కశింకోట మండలం పాతకన్నూరుపాలెంలో పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చారు. యువత వెన్నంటే ఉంటూ జేజేలు పలికారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన వెంట కొనసాగారు. పాదయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి కశింకోట మండలం పాతకన్నూరుపాలెంలో బసచేసిన చంద్రబాబు శనివారం తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు.

అయినప్పటికీ పార్టీనాయకులు, కార్యకర్తలు ఈదురుగాలులు, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శుభాకాంక్షలు చెప్పేందుకు తరలివచ్చారు. దీంతో చంద్రబాబు బస్సు నుంచి దిగి వచ్చి నాయకులు, కార్యకర్తల నుంచి శుభాకాంక్షలను స్వీకరించారు. ఆయన బస చేసిన ప్రాంగణం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకూ అభిమానుల కోలాహలంతో సందడి నెలకొంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు పాదయాత్ర ప్రారంభించిన బాబుకు ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. కన్నూరుపాలెం జంక్షన్ వరకూ జనం కిక్కిరిసి పాదయాత్రలో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రసంగానికి జేజేలు పలికారు.

ఈ సందర్భంగా ప్రజలు తమ కష్టాలను ఏకరవుపెట్టారు. తాగేందుకు నీరులేదని, ఉండేందుకు ఇళ్లు లేవని, తినడానికి తిండిలేదని, నిద్రపోతామంటే విద్యుత్ సమస్య అని గోడు వెళ్లబోసుకున్నారు. సాగునీరు లేక వ్యవసాయం దెబ్బతింటున్నదని, పాఠశాలలకు పక్కా భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మాటలకు చలించిన చంద్రబాబు అధికారం కట్టబెడితే ఇంటికి పెద్దకొడుకులా బాగోగులు చూస్తానని భరోసా ఇచ్చారు. తన పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడాను బేరేజు వేసుకోవాలన్నప్పుడు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది.

'ఔను...ప్రస్తుత పాలన మాకొద్దంటూ' కేకలు వేశారు. మళ్లీ చంద్రబాబే రావాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన కొత్తూరు జంక్షన్‌కు వస్తుండగా చినుకులు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత వర్షం పెద్దదయ్యింది. అయినప్పటికీ ప్రజలెవరూ పాదయాత్ర నుంచి చెదరకుండా చంద్రబాబు వెంట నడక సా

గించారు. కొత్తూరు జంక్షన్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీ, టీఆర్ఎస్‌పై కూడా విరుచుకుపడ్డారు.

శనివారం అనకాపల్లిలో పాదయాత్రకు పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌గా దాడి రత్నాకర్ భారీ స్థాయిలో జనసమీకరణ చేశారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా లేకపోయినప్పటికీ జనం చీకట్లో వేచి ఉండి చంద్రబాబును చూశారు. పర్యటనకు ముందు చంద్రబాబును ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెరిగింది.