April 21, 2013

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంకండి

కొయ్యూరు/మాకవరపాలెం: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పాదయాత్రలో భాగంగా తామరం బీఈడీ కళాశాల ఆవరణలో బసచేసిన చంద్రబాబు
సాయంత్రం భీమిలి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 2014లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నేతలు కృషిచేయాలన్నారు.

జిల్లాలో ఇప్పటికే ఐదు నియోజకవర్గాల కార్యకర్తలను కలిశానని, ఇంకా తొమ్మిది నియోజకవర్గాల వారిని కలవాల్సి ఉందన్నారు. కార్యకర్తలే టీడీపీకి పెద్ద ఆస్తిగా ఉన్నారన్నారు. కార్యకర్తల రుణం తీర్చుకునే రోజు త్వరలోనే వస్తుందని, పార్టీ పూర్వవైభవానికి కార్యకర్తలందరూ ముందుకు సాగాలని బాబు కోరారు. గత 30ఏళ్ల కాలంగా పార్టీ కార్యకర్తల త్యాగాన్ని చేస్తూ రావడం వల్లే నాడు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌కు, ప్రస్తుతం తనకు జాతీయస్థాయిలో గౌరవం దక్కిందన్నారు. ఈ సమావేశాల వల్ల కార్యకర్తల నుంచి చాలావిషయాలు తెలుస్తున్నాయని, దీని ఆధారంగానే రానున్న రోజుల్లో నేతల పనితీరును అంచనావేసి కష్టపడి పనిచేసేవారినే అందలం ఎక్కిస్తానని బాబు కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

అవినీతిపనులను ప్రజల ఉపేక్షించరు కాంగ్రెస్ పాలనలో మైనింగ్ మాఫియాపై తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం ఫలించిందని బాబు తెలిపారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన పిల్ల కాంగ్రెస్ రాష్ట్రంలో అడ్రస్ ఉండదన్నారు. పాదయాత్రలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో అవినీతిరంగులను ప్రజలు ఉపేక్షించరన్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని కార్యకర్తలు, నేతలు ప్రజల్లోకి వెళ్లాలన్నారు.

భీమిలిలో ఓటమికి కారణం పార్టీ తప్పిదమే 2004, 2009 ఎన్నికల్లో పార్టీకి కంచుకోటగా ఉన్న భీమిలి నియోజకవర్గం ఓటమి పాలవ్వడానికి పార్టీకి సరైన సమాచారం లేకుండా, అభ్యర్థి ఎంపికలో చేసిన పొరపాటే కారణమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది పునరావృతం కాకుండా సరిదిద్దే చర్యలు చేపడతానని కార్యకర్తలకు హామీనిచ్చారు. ఇందులో భాగంగా అభ్యర్థి ఎంపికలో వారి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తామన్నారు. ఇప్పటి నుంచి ఎన్నికలు ముగిసేవరకు కార్యకర్తలు పార్టీ విజయానికి కృషిచేయాలని కోరారు.