April 24, 2013

నిప్పులు కక్కుతున్న ఉప్పూ పప్పూ ఇంకెవరి కోసం 'అమ్మహస్తం'?

రుణమే మాఫీ చేస్తా!
రైతుకు అప్పు ముప్పు తప్పిస్తా
ఆడబిడ్డల తాకట్టు వస్తువులూ విడిపిస్తా
గొంతు కోసే పథకంగా.. నగదు బదిలీ
అధికారంలోకి వస్తే మెరుగైన 'ఆరోగ్య బీమా'
విశాఖ పాదయాత్రలో చంద్రబాబు
ముస్తాబవుతున్న పైలాన్

విశాఖపట్నం/కశింకోట : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణాలపై వడ్డీనే కాదు..అసలునూ మాఫీ చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే.. పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెరుగైన ఆరోగ్య బీమా పథకం తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. నగదు బదిలీని ప్రజల గొంతుకోసే పథకంగా కాంగ్రెస్ పాలకులు మారుస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా కశింకోట వద్ద మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పిసినికాడ, కొత్తూరు జంక్షన్, పూడిమడక జంక్షన్, అనకాపల్లి, సుంకరమెట్ట జంక్షన్, శంకరం మీదుగా నడక సాగించారు.

"రైతు రుణాల మాఫీకి మా పార్టీ కట్టుబడి ఉంది. బ్యాంకుల నుంచి రైతులు తీసుకునే అప్పులన్నీ రద్దుచేస్తాం. అలాగే.. భార్యా పిల్లల నగలు తాకట్టుపెట్టి వ్యవసాయ రుణం తీసుకున్న వారినీ విముక్తులను చేస్తాం. ఆడపడుచుల వస్తువులను తిరిగి వారికి చేరుస్తాం'' అని పిసినికాడలో జరిగిన సభలో భరోసా ఇచ్చారు. వృద్ధులకు, వికలాంగులకు 600 రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు. 'మీ నియోజకవర్గంలో వృద్ధుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేస్తామ''ని అనకాపల్లిలో హామీ ఇచ్చారు. చదువుమీద దృష్టి సారించడంతోపాటు అవినీతిపై పోరాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దారిలో ప్రజలు చెప్పిన సమస్యలు ఆలకించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. "నగదు బదిలీ.. నకిలీ బదిలీ పథకంలా మారుతోంది. మార్కెట్‌లో 45 రూపాయలు ధర పలికే బియ్యానికి 14,15 రూపాయల ధర కట్టి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. అదే జరిగితే ఆకలిచావులు తథ్యం'' అని ఆవేదన వ్యక్తంచేశారు.

నిత్యావసర వస్తువుల ధరలు మూడు వందల రెట్లు పెంచేసి.. 'అమ్మ హస్తం' అంటూ కంటితుడుపు చర్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం సరిపెడుతోందని దుయ్యబట్టారు. " మహిళల కష్టాలు తొలగించేందుకు మా హయాంలో సబ్సిడీపై గ్యాస్ అందజేశాం. వంద రూపాయలకే సిలిండర్ ఇచ్చాం. కాంగ్రెస్ వచ్చి..దాని ధరను రూ.400పైగా పెంచేసింది. బ్లాక్‌లో వెయ్యి రూపాయల వరకూ అమ్ముతున్నా రు. పేదలను ఆదుకోవడానికి రూ.15 వేల కోట్లు నగదు బదిలీ కింద కేటాయించాలని కేంద్రానికి సూచించాను. కానీ, కాంగ్రెస్ పాలకులు దాన్నో ప్రహసనంగా మార్చివేశారు'' అని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డబ్బంతా నాయకులకు దక్కితే, కష్టాలు ప్రజలకు మిగిలాయని విమర్శించారు. కొడుకు అక్రమాస్తులు సంపాదిస్తున్నప్పుడే అతని తల్లి విజయలక్ష్మి, తండ్రి వైఎస్ హెచ్చరించి ఉంటే జగన్‌కు జైలు గతి పట్టేదా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కు తాము మద్దతిచ్చామని, అయితే సీఎం కిరణ్ తానొక్కడే ఈ పథకానికి రూపకర్తనన్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. కాపులు ఆర్థికం గా నిలదొక్కుకునేందుకు తమ పార్టీ ఒక ప్రణాళికను ప్రకటించిందని, బీసీ డిక్లరేషన్ వంటి అభ్యుదయ పథకాలను అధికారంలోకి వస్తే అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. ఇదిలాఉండగా చంద్రబాబు పాదయాత్ర ముగింపునకు చిహ్నం గా అగనంపూడి టోల్‌గేటు సమీపంలోని శివాజీనగర్ వద్ద చేపట్టిన 64 అడుగుల ఎత్తయిన పైలాన్ నిర్మాణం పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహనరావు, తుమ్మల నాగేశ్వరరావు, కళా వెంకటరావు, నల్లూరి భాస్కరరావు తదితరులు దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.