April 24, 2013

క్రమశిక్షణ రాహిత్యాన్ని క్షమించను..

గాజువాక
:'క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించను.. ఎగిరెగిరి పడితే మీరేమైనా గొప్పవారు అనుకుంటున్నారా.. ఆవల్లిస్తే పేగులు లెక్కపెట్టగల సామర్థ్యం నాకుంది.. అరుపులు, కేకలు వేస్తే భయపడేది లేదు'' అని పార్టీ శ్రేణులను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మంగళవారం గాజువాక నియోజకవర్గ సమీక్షా సమావేశం వేదికపైకి కోన తాతారావును పిలవకపోవడంతో కొంతమంది కార్యకర్తలు అరుపులు, కేకలతో నిరసన తెలిపారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పైవిధంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరని, ఏదైనా చెప్పాలనుకుంటే ఓ పద్ధతి వుంటుందన్నారు. పార్టీ కోసం పనిచేసేవారు కావాలి తప్ప స్వప్రయోజనాల కోసం పార్టీని వినియోగించుకునే వారు అవసరం లేదన్నారు. పార్టీ బాగుంటే లీడర్లు, కింది స్థాయి కేడర్‌కు గుర్తింపు వస్తుంది. పార్టీని పటిష్ఠ పరిచేందుకు పనిచేసే నాయకుడే కావాలన్నారు.

నాయకుల కంటే కార్యకర్తల మనోభావాలను తెలుసుకునేందుకే ఈ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకుల మధ్య భేదాభిప్రాయాలు వస్తే పార్టీకే నష్టం వాటిల్లతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలన్నారు. గాజువాక నియోజకవర్గ సమీక్షా సమావేశం వేదికపైకి తొలుత గుడివాడ నాగమణిని ఆహ్వానించారు. తర్వాత ఫైవ్‌మెన్ కమిటీ సభ్యులు పల్లా శ్రీనివాసరావు, హర్ష, ప్రసాదుల శ్రీనివాస్, పప్పు రాజారావులను పిలిచి, కోన తాతారావును పిలవకపోవడంతో కార్యకర్తల నినాదాలు చేశారు. అనంతరం చంద్రబాబు సూచన మేరకు కోన తాతారావును వేదికపైకి ఆహ్వానించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

వర్గాలకు దూరంగా వుండండి తెలుగుదేశం పార్టీకి గాజువాక నియోజకవర్గం కంచుకోట అని, అక్కడ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఐక్యంగా పనిచేయకుండా వర్గ రాజకీయాలు చేయడమేమిటని చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాజువాక గొడవలు నాకు తెలుసని, నాయకుల్లో మార్పు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ ఒక్క నాయకుడు ప్రజలతో మమేకమై పనిచేసే పరిస్థితి లేకపోగా, నాయకత్వం కోసం పోటీ పడడం మంచి పద్ధతి కాదన్నారు. పార్టీ బలోపేతానికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫైవ్‌మెన్ కమిటీని నియమించామని తెలిపారు. అందరిని కలుపుకొని కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత కమిటీపైనే వుందన్నారు. సక్రమంగా పనిచేయకపోతే కమిటీలు ఎందుకంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఐక్యంగా పనిచేయండి గాజువాకలో గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం, సీపీఎం బరిలోకి దిగడంతో కొన్ని సమస్యలు తలెత్తాయని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీల పొత్తుల విషయమై ఎటువంటి నిర్ణయం చేయలేదని, పార్టీ శ్రేణుల మనోభావాలకనుగుణంగా గాజువాక విషయంలో ఆచితూచి అడుగేస్తామంటూ హామీ ఇచ్చారు.

పార్టీని దిగువ స్థాయి నుంచి పటిష్ఠ పరచడంలో భాగంగా బూత్, వార్డు, ఏరియా, నియోజకవర్గ కమిటీలను మరింత ప్రక్షాళన చేయనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ బలోపేతానికి సలహాలు, సూచనలను తమకు అందజేయాలని కోరారు.