April 24, 2013

ప్రజల గొంతు కోస్తారా?

ముత్తుకూరు: ప్రాజెక్టుల కోసం ప్రజల గొంతు కోస్తారా అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్తుకూరు మండలంలోని జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రం గ్రామాల మధ్య తలపెట్టిన బూడిద చెరువుల నిర్మాణ స్థలాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. గ్రామాల నడిబొడ్డున బూడిద చెరువులను నిర్మించాలనుకోవడం అమానుషమని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బూడిద చెరువుల నిర్మాణస్థలాన్ని పరిశీలించేందుకు వెళుతున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది.

అధికారం చేతులో వుందని ఇష్టానుసారం ప్రవర్తిస్తే ప్రజల ఉసురు తగిలి పోతారని సోమిరెడ్డి, జెన్‌కో సీఈ సత్యనారాయణపై మండిపడ్డారు. అంతకుముందు బూడిద చెరువుల విషయంపై మాట్లాడేందుకు ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, దేశం ఎమ్మెల్యేలతో కలిసి జెన్‌కో సీఈ కార్యాలయంలో సమావేశమయ్యారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ బాల వెంకటేశ్వరరావు, సీఐలు గంగా వెంకటేశ్వర్లు, సుధాకర్‌రెడ్డి పరిస్థితులను పర్యవేక్షించారు.