April 24, 2013

మెండి గోడలకు మోక్షమెప్పుడో!: చంద్రబాబు

ఇల్లు ఉంటుంది. కానీ, కప్పు ఉండదు. గోడలు ఉండవు. తలుపులూ కిటికీలూ ఏమీ ఉం డవు. అలాంటి ఇల్లు ఎక్కడ ఉన్నదంటారా?అయితే, హైదరాబాద్ సచివాలయంలో రాజీవ్ గృహకల్ప విభాగానికి వెళ్లండి. ఆ డిపార్టుమెంట్‌లో దుమ్ముపట్టిన ఏ కాగితం తిరగేసినా ఇలాంటి ఇళ్లు కోకొల్లలు.. అనకాపల్లిలో ఎంతోమందికి సొంతిళ్లు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. అవి ఎక్కడున్నాయో తమకూ తెలియదని..అంత కష్టంలోనూ నవ్వుతూ చెప్పారు. ఆ నవ్వులో నిర్వేదం, నిస్సహాయతే కనిపించాయి. కాయకష్టం చేసి ఇంటికి చేరిన కష్టజీవికి సొంత ఇంట్లో ఉండే ప్రశాంతత మరెక్కడా దొరకదు. వీళ్లు కోరుకున్నది అలాంటి ప్రశాంతతే. కానీ, తొమ్మిదేళ్లుగా ఈ పాలకులు వాళ్లకు ఇళ్లు కాదు కదా... కళ్ల మీద కునుకు కూడా లేకుండా చేస్తున్నారు.

రేబాక దాటి వస్తుండగా, అసంపూర్ణంగా వదిలేసిన 'గృహకల్ప' సముదాయం కనిపించింది. గుట్టల మీద కట్టారు. ఆ గుట్టలు ఎక్కడమే కష్టమయితే.. 'గృహకల్ప'లోకి దారి వెతకడం మరింత కష్టమనిపించింది. అంతర్గత రోడ్లు లేవు. మంచినీటి పైపులైన్లు లేవు. విద్యుత్ సరఫరా కూడా లేదు. మాంత్రికుడి కోటలా ఉన్న అది..'గృహకల్ప' భవన సముదాయమనే విషయం మొదట గుర్తించలేకపోయాను. ఎందుకీ పరిస్థితి అని అక్కడివారిని ఆరా తీశాను " ఒక్కొక్కరి నుంచి 10,500 చొప్పున కట్టించుకొని, కొంత మేర కట్టుబడి చేశారు. ఆ తరువాత కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు.. మరికొన్ని వేలు తెస్తేనే మిగతా నిర్మాణం పూర్తిచేసి గృహ ప్రవేశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు సార్'' అని నిట్టూర్చారు. ఈ మొండి గోడలకు మోక్షమెప్పుడో!