April 24, 2013

ఎన్నికల్లో టీడీపీకి తిరుగుండదు

నర్సీపట్నం: చంద్రబాబునాయుడు పాదయాత్ర ఫలితాలు కచ్చితంగా రాబోయే స్థానిక, సాధారణ ఎన్నికల్లో కనిపిస్తాయని, భవిష్యత్‌లో ఇక టీడీపీకి తిరుగుండదని పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో చంద్రబాబు పాదయాత్ర ఘనవిజయం సాధించిన సందర్భంగా పార్టీ వర్గీయులను అభినందించేందుకు మంగళవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు ప్రసంగించారు. విశాఖ జిల్లా పాదయాత్రలో భాగంగా నర్సీపట్నం నియోజవకర్గంలో ఎనిమిది రోజుల పాటు చంద్రబాబు పర్యటించడం పార్టీ అదృష్టమన్నారు.

నర్సీపట్నం నియోజకవర్గంలో చంద్రబాబు పాదయాత్ర ఘనవిజయం కావడానికి నాయకులు, కార్యకర్తల కృషి ఫలితమేనని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు తనను అభినందిస్తున్నారని, ఆ ఘనత మీకే దక్కుతుందని అయ్యన్న ప్రశంసించారు. నియోజకవర్గంలో చంద్రబాబు పాదయాత్రకు లభించిన స్పందనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, పాదయాత్ర ఫలితాలు రానున్న స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల్లో విజయానికి దోహదపడతాయని అన్నారు. స్థానిక ఎన్నికల్లో విజయావకాశాలు గల అభ్యర్థులను సమిష్టి నిర్ణయంతో ఎంపిక చేయాలని సూచించారు.

పంచాయతీల ఓటర్ల జాబితాలను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పరిశీలించి మిగిలిపోయిన ఓటర్లను చేర్పించాలని అయ్యన్న చెప్పారు.

ప్రతి వంద మంది ఓటర్లకు ఒక సమర్థుడైన నాయకుడిని ఎంపిక చేసి, వారి బాధ్యతను అప్పగించాలని, తగిన నాయకత్వ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే ఎంపికలో ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.

భవిష్యత్‌లో మండలాలు వారీగా ఏర్పాటు చేయనున్న సమన్వయ కమిటీల పాత్ర ఎంతో కీలకం కానున్నదని అయ్యన్న అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడు, తనయుడు విజయ్ పాల్గొన్నారు.

27న జనసంద్రం కానున్న విశాఖ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా... మీకోసం పాదయాత్ర ముగింపు సభ విశాఖ చరిత్రలో చెరగని ముద్ర వేయనున్నదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అన్నారు.

మంగళవారం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 27న విశాఖపట్నం సిటీ జనసంద్రంగా మారనున్నదని, ముగింపు సభకు ఎంతమంది ప్రజలు హాజరవుతారనేది ఊహకు అందడం లేదని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావడానికి వీలుగా 11 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని, వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. బస్సులు, ఇతర వాహనాలు అసంఖ్యాకమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం అప్పజెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని అయ్యన్న అన్నారు.