April 24, 2013

విశాఖ సభను విజయవంతం చేద్దాం


మచిలీపట్నం-ఈడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర పూర్తి చేస్తున్న సందర్భంగా ఈనెల 27న విశాఖపట్నంలో నిర్వహించనున్న సభా కార్యక్రమాలను విజయవంతం చేయాలని మైలవరం ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా పిలుపు నిచ్చారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా పార్టీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. 63 ఏళ్ళ వయస్సులో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు బాబు 2500కి.మీ. పాదయాత్ర చేశారన్నారు.

విశాఖపట్నం ఇంజనీరింగ్ కళాశాలలో జరగనున్న బాబు అభినందన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారన్నారు.జిల్లాలో అవనిగడ్డ, నూజివీడు, పెనమలూరు నియోజకవర్గాలకు త్వరలో పార్టీ ఇన్‌చార్జులను నియమిస్తామన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై పార్టీ చేపట్టిన సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేయాలన్నారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మండల స్థాయి కోర్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. మండల స్థాయి కమిటీలకు జిల్లా నాయకులందరూ హాజరవుతారన్నారు.

రానున్న పంచాయతీరాజ్ ఎన్నికల్లో 50 శాతం మహిళలకు రిజర్వు అయినందున మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలన్నారు. చంద్రబాబును విమర్శించే కొడాలి నానికి పుట్టగతులుండవన్నారు. సినీనటుడు బాలకృష్ణ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నిరాజనాలు పడుతున్నారని తెలిపారు. జగన్‌కు బెయిల్ ఇవ్వాలంటే పార్టీని విలీనం చేయాలని షరతులు విధిస్తున్నారని ఉమా చెప్పారు. దీనిపై సోనియాగాంధీతో వైసీపీ నాయకులు మంతనాలు జరుపుతున్నారని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మాట్లాడుతూ, అంబటి బ్రాహ్మణయ్య రాజకీయాలలో నిబద్దత గల నాయకుడన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు మాట్లాడుతూ, కష్టకాలంలో పార్టీకి అంబటి జిల్లా అధ్యక్షునిగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. వర్ల రామయ్య మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. నాగుల్ మీరా మాట్లాడుతూ, ఈనెల 29న విజయవాడలో మైనార్టీ సెల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. బీసీ సెల్ నాయకుడు వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోను బీసీ డిక్లరేషన్ పై సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. బందరు నియోజకవర్గం ఇన్‌చార్జి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, పార్టీ పటిష్టతకు బ్రాహ్మణయ్య చేసిన కృషి మరువలేమన్నారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, మాజీఎమ్మెల్యే రావి వెంకట్రావు, కేశినేని నాని, చలసాని ఆంజనేయులు, లంకిశెట్టి బాలాజీ, చలమలశెట్టి రామాంజనేయులు, బొడ్డు వేణుగోపాలరావు, పెదబాబు, అంకయ్య గౌడ్, గొట్టిపాటి రామకృష్ణ, దేవినేని చంద్రశేఖర్, ఆళ్ళ గోపాలకృష్ణ, కుర్రా నరేంద్ర, మోటమర్రి బాబా, గోపు సత్యనారాయణ, చిలంకుర్తి తాతయ్య, కైతేపల్లి దాసు, బత్తిన దాసులు ప్రసంగించారు. తొలుత బ్రాహ్మణయ్య చిత్రపటానికి దేవినేని ఉమా తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.