April 24, 2013

పల్లెకు కోతలు ఎత్తేస్తారా.. కోర్టుకు వెళ్లమంటారా?

గ్రామీణులు ద్వితీయ శ్రేణి పౌరులా?
పల్లెలకు కోతలు ఎక్కువ ఎందుకు
ఈఆర్‌సీ ఎద్ద టీడీపీ నేతల బైఠాయింపు
27న డిస్కంలతో భేటీకి ఈఆర్‌సీ హామీ

హైదరాబాద్: 'అందరికీ బాదుడు ఒకటే! కోతలు మాత్రం పల్లెలకు ఎక్కువ? ఏమిటీ అన్యాయం?' అని టీడీపీ నేతలు మండిపడ్డారు. విద్యుత్ సరఫరాలో డిస్కంలు వివక్ష పాటిస్తున్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, లింగారెడ్డి, ఎమెల్సీ రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వేం నరేంద్రరెడ్డి బుధవారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కమిషన్ (ఈఆర్‌సీ) ముందు బైఠాయించారు. కోతలు ఎత్తివేస్తారా? లేదా కోర్టుకెళ్లమంటారా? అని ఈఆర్‌సీ సభ్యులను ప్రశ్నించారు.

"విద్యుత్ డిస్కంలు ఒకే టారిఫ్‌లో ఉన్న వినియోగదారులకు వేరువేరుగా విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. నగరాల్లో 2 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో ఏకంగా 12 గంటలు కోత విధిస్తున్నారు. గ్రామాలపై వివక్ష చూపుతున్నారు. కరెంటు కోతలతో గ్రామాల్లో తాగడానికి కూడా నీళ్లు దొరకడంలేదు. రైతులు, చేతి వృత్తుల వారు తీవ్రంగా నష్టపోతున్నారు'' అని పయ్యావుల పేర్కొన్నారు. "పల్లె ప్రజలంటే ద్వితీయ శ్రేణి పౌరులు కారు. పట్టణాలకు ఒక న్యాయం, పల్లెలకు మరో న్యాయమా?' అని నిలదీశారు. డిస్కంలు, బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటున్న ఈఆర్‌సీ... సామాన్య ప్రజల ప్రయోజనాల రీత్యా కోతలు ఎత్తివేసేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. 'ఒకే టారిఫ్‌లో ఉన్న వారికి ఒకే రకమైన సరఫరా' ఉండేలా డిస్కంలను ఆదేశించాలని ఈఆర్‌సీ అధ్యక్షుడు రఘోత్తమరావును కోరారు.

లేదంటే హైకోర్టుకు వెళ్తానని పయ్యావుల హెచ్చరించారు. అయితే, ఈ విషయంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని, మిగిలిన సభ్యులతో చర్చించాల్సి ఉందని చైర్మన్ చెప్పారు. అయితే... కోతలు ఎత్తివేయాలని డిస్కంలను ఆదేశించేదాకా కదలేది లేదని టీడీపీ నేతలు భీష్మించుకు కూర్చున్నారు. ఈ క్రమంలో పట్టువీడాలని కమిషన్ పలుమార్లు పయ్యావులతో సంప్రదింపులు జరిపింది. రఘోత్తమరావు బుధవారమే పదవీ విరమణ చేస్తుండం, టీడీపీ బృందం పట్టువీడకపోవడంతో ఈఆర్‌సీ అత్యవరంగా సమావేశమై విద్యుత్ కోతలపై చర్చించింది. ఈ నెల 27న డిస్కంలతో సమావేశమై కోతలపై చర్చించాలని నిర్ణయించారు. విద్యుత్ సరఫరాలో వివక్ష పట్ల 29వ తేదీన తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. దీంతో టీడీపీ నేతలు ధర్నా విరమించారు.