April 24, 2013

ఆనాడే క్షమాపణ చెప్పారు :ఉమామహేశ్వరరావు

మచిలీపట్నం/పామర్= ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో నందమూరి కుటుంబం మధ్య ఎటువంటి స్పర్ధలు లేవని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా టీడీపీ సమావేశం మంగళవారం మచిలీపట్నంలో జరిగింది. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ, గతంలో ఎప్పుడో జరిగిన వివాదానికి ఆనాడే ఎన్టీఆర్‌కు క్షమాపణ చెప్పారని, అప్పటి నుంచి అందరూ కలిసి పోయారని తెలిపారు. రాకపోకలు కూడా బాగానే ఉన్నాయన్నారు.

పార్టీ పటిష్ఠానికి బాలకృష్ణ కృషి చేస్తున్నారని, దానిలో భాగంగా పలువురిని కలుస్తున్నారని వివరించారు. ఆయన నిమ్మకూరు పర్యటన కారణంగా నందమూరి కుటుంబంలో వివాదాలు ఏమీ లేవన్నారు. కాగా ఎన్టీఆర్, వెంకటరత్నం కుటుంబాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఆనాడే ఎన్టీఆర్‌కు వెంకటరత్నం క్షమాపణ చెప్పారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తెలిపారు. ఆ ఘటన తర్వాత కూడా ఎన్టీఆర్ నిమ్మకూరు వచ్చారని గుర్తు చేశారు. ఈ విషయంలో బాలకృష్ణ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా పామర్రులోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

"తన స్థలంలో ప్రభుత్వాస్పత్రి నిర్మాణం జరుగుతోందని ఆగ్రహించి 1987 ఏప్రిల్ 29న నందమూరి వెంకటరత్నం దానికి అభ్యంతరం తెలిపారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేద్దామనుకుంటే ఆటంకాలా అని ఎన్టీఆర్ కలత చెందిన మాట వాస్తవమే. నిమ్మకూరులో అడుగు పెట్టనని అన్నమాట కూడా నిజమే. అయితే, ఆ తర్వాత నిమ్మకూరుకు చెందిన గ్రామ పెద్దలు వెంకటరత్నంను మందలించి ఎన్టీఆర్‌కు క్షమాపణ చెప్పించి కోర్టులో ఉన్న కేసును ఉపసంహరింపజేశారు. ఎన్టీఆర్‌కు క్షమాపణ చెప్పారు. ఎన్టీఆర్ కూడా క్షమించారు. వారి ఆహ్వానం మేరకు 1988 మే 21న ఎన్టీఆర్ నిమ్మకూరు వచ్చి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న శ్రీవెంకటేశ్వర స్వామి రాజగోపురానికి శంకుస్థాపన చేశారు కూడా. వెంకటరత్నం కుమారుడు మురళీకి నిమ్మకూరు కళాశాలలో ఉద్యోగం ఇప్పించారు.

1999లో గుడివాడ నియోజకవర్గం నుంచి హరికృష్ణ పోటీ చేయగా వెంకటరత్నం ఆయన గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పామర్రు మండలంలో ప్రచారం చేశారు'' అని రామయ్య వివరించారు. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగానే శివరామకృష్ణ ఇంటికి బాలకృష్ణ వెళ్లారని చెప్పారు. ఆ ఇంటి నుంచే నిమ్మకూరు గ్రామ పెద్దలను సమావేశపరచి టీడీపీని అధికారంలోకి తీసుకు రావాలని కోరారన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే బాలకృష్ణ లక్ష్యమని వ్యాఖ్యానించారు. అవినీతి రక్కసి విశృంఖల విహారం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కోట్లాది రూపాయల అవినీతి సొమ్ముతో రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ టీడీపీలో క్రియాశీల పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చారన్నారు.

నాయిని ఓ పోతురాజు: టీడీపీ
టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డిని తెలంగాణలో బోనాల పండుగలో డప్పులకు అనుగుణంగా గంతులు వేసే పోతరాజుగా టీడీపీ అధికార ప్రతినిధి ఎన్.నర్సిరెడ్డి అభివర్ణించారు. మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. "నాయినికి ఒళ్లే మందం అనుకున్నాం. మెదడు కూడా మందమైనట్లుంది' అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీకి గోకుడు రోగముందని, ఆ దురద పోవాలంటే ఎవరితోనైనా గీకించుకోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు.