April 24, 2013

వీళ్లను ఎవరు ఆదుకోవాలి?

బెల్లం తీపి.. చక్కెర స్వీటు. ప్రతి వంటింట్లో అదోఇదో ఉండాల్సిందే. ప్రతి పదార్థం తయారీలోనూ అవి పోటీపడతాయి. 'నేనంటే నేను..' అంటూ ముందుకొస్తాయి. పాకం నుంచి ఉండల దాకా.. బెల్లమో, చక్కెరో ఉండాల్సిందే. మరి ఈ రెండూ ఒకే చోట ఒకే పరిమాణంలో అందుబాటులోకి వస్తే..? ఇక చెప్పాల్సిందేమిటి! అందువల్లే తీపి కబుర్లు వింటానని అనకాపల్లిలో అడుగుపెట్టినప్పుడు అనుకున్నాను. ఎందుకంటే.. దేశంలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్‌యార్డు ఈ పట్టణంలో ఉంది.

అలాగే.. చెరుకు పండే ప్రధాన ప్రాంతాల్లో అనకాపల్లి కూడా ఒకటి. కానీ, ఒక్కో రైతును కలుస్తున్నకొద్దీ నోరంతా చేదైపోయినట్టు అనిపించింది. ప్రజలకు కారం పెట్టి.. ఆ తరువాత నీళ్లు తాగించే ఈ పాలకులకు వేరే రుచులేవీ రుచించనట్టుంది. పంటకు గిట్టుబాటు లేదట. గిట్టేదాకా ఉంచుకోవడానికి తగిన నిల్వ వసతులు లేవట. దళారి చెప్పిన ధరకే తెగనమ్మాల్సి వస్తున్నదట. 'చేయూత ఇవ్వాల్సిన వాళ్లే చేతులు నరికేస్తుంటే ఏమి చేయాలి సార్?' అని ఓ రైతు ప్రశ్నించాడు.

చక్కెర రైతుదీ ఇదే ప్రశ్న. పండించే పంటలో కొంతభాగం తుమ్మపాల చక్కెర కర్మాగారానికి తరలిస్తున్నారట. ఆ పరిశ్రమ ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో అందరికీ అక్కరకు రాలేకపోతున్నదట. పైగా బకాయిలు పేరుకుతున్నాయని రైతులు వాపోతున్నారు. మరోవైపు సర్వి రైతులదీ ఇదే పరిస్థితి. వీళ్లను ప్రభుత్వాలు కాకపోతే ఎవరు ఆదుకుంటారు?