April 24, 2013

బలపడుతున్న అడుగు!


రాష్ట్ర ప్రజలకు నాయకుల పాదయాత్రలు కొత్తకావు. కానీ, వాటికీ 200 రోజులకు పైగా సాగుతున్న చంద్రబాబు పాదయాత్రకు సామ్యమే లేదనేది రాజకీయవర్గాల మాట. రాష్ట్ర చరిత్రలో రెండు వేల కిలోమీటర్లకు పైగా నడిచిన మరో నేత లేకపోవడం ఒక కారణం కాగా..64 ఏళ్ల వయసులో ఆయన నడకకు సిద్ధం కావడం మరో కారణం. నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను కళ్లారా చూస్తే తప్ప ఆ తీవ్రత అర్థం కాదన్న ఉద్దేశంతో గత ఏడాది అక్టోబర్ రెండో తేదీన అనంతపురంలో పాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. అప్పటినుంచీ క్షేత్రస్థాయి సమస్యలపై చూపు నిలిపి.. ప్రతి ఒక్కరి అభిమానం చూరగొన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం గాడిలో పడుతుందనే విశ్వాసాన్ని పాదుగొల్పగలిగారు. దానికి తగినట్టే..'మీ ఇంటి పెద్దబిడ్డగా వచ్చాను. ఆదరించి ఆశీర్వదించండి' అంటూ చంద్రబాబు చేస్తున్న విజ్ఞప్తికీ మంచి స్పందన లభిస్తోంది. వ్యవసాయం మూలన పడటానికి, నిరుద్యోగానికి, దారిద్య్రానికి అవినీతే కారణమన్న విషయాన్ని జనంలోకి లోతుగా తీసుకెళ్లగలిగారు. ఆదివాసీ, దళిత, బడుగు వర్గాలకోసం విరివిగా పథకాలు, డిక్లరేషన్లు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మధ్యతరగతి వారినీ బాగా ఆకట్టుకున్నారు. ఈసారి ఏదిఏమైనా అసెంబ్లీలోకి 'సైకిల్' దూసుకుపోవాల్సిందేనని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నారు.