April 24, 2013

బాబును కలిసిన 'దాడి' కుటుంబం


కశింకోట: శాసనమండలి ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు కుటుంబ సభ్యులు మంగళవారం ఆర్ఈసీఎస్ ప్రాంగణంలో బసచేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును కలిశారు. ఎవరు ఎక్కడ ఉంటున్నారని బాబు ప్రశ్నించగా... తమది ఉమ్మడి కుటుంబమని పార్టీ అధ్యక్షుడు దాడి రత్నాకర్ చెప్పారు. ప్రస్తుత రోజుల్లో కూడా ఉమ్మడిగా ఉంటున్నారా? ఇంట్లో ఎంతమంది ఉంటారు? అని చంద్రబాబు ఆసక్తిగా అడిగారు. పెద్దలు, పిల్లలు కలిసి 22 మంది వున్నారని రత్నాకర్ చెప్పగా, వంట ఎవరు చేస్తారని బాబు
అడిగారు. కుటుంబ సభ్యులమే చేస్తామని దాడి వీరభద్రరావు భార్య పద్మావతి బదులిచ్చారు.

ఏ రకం వంటకాలు చేయాలని ఎవరు నిర్ణయిస్తారని బాబు ప్రశ్నించగా... నిర్ణయాలంటూ ఎవరూ చేయరని, అయితే తమ అమ్మమ్మ రమాదేవి సూచనల మేరకు వంట చేస్తారని రత్నాకర్ చెప్పారు. ఆమె వయస్సు ఎంత ఉంటుందని బాబు ప్రశ్నించగా 80 ఏళ్లు అని చెప్పారు. ఇంత వయస్సులో కూడా ఆమె ఏ వంటకాలు చేయాలో చెప్తారా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చిరునవ్వి నవ్వారు.

మా ఇంట్లో నేను, నా భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ , కోడలు ఉంటాం. కానీ నలుగురం కలిసి భోజనం చేసేది చాలా అరుదు. మీరంతా(22 మంది) ఒకేచోట కలిసి భోజనం చేయడం అభినందనీయమని చంద్రబాబు అన్నారు.

దాడి వీరభద్రరావు తమ్ముడు కుమార్తె భారతిని ఎక్కడ ఉంటున్నావని ప్రశ్నించగా.... ఆమె ఆ్రస్టేలియాలో ఉంటున్నానని చెప్పింది. మెల్‌బోర్న్‌లో తెలుగువారిపై దాడులు జరుగుతున్నాయి కదా... మీకు ఇబ్బంది ఏమైనా ఉందా? అని బాబు ప్రశ్నించారు. తాము బ్రిస్‌బేన్ ప్రాంతంలో ఉంటున్నామని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని భారతి చెప్పారు. సంపాదన, ఖర్చులు, తదితర విషయాల గురించి ఆయన అడిగారు. అనంతరం తమ ఇంటి నుంచి తీసుకువచ్చిన భోజన పదార్థాలను చంద్రబాబుకు అందజేశారు.

టీడీపీ అధినేతను కలిసిన వారిలో రత్నాకర్‌తోపాటు దాడి వీరభద్రరావు సతీమణి పద్మావతి, పెద్ద కుమారుడు జగన్ ప్రభాకర్, అతని భార్య షర్మిల, రెండో కోడలు రామలక్ష్మి, చిన్నకోడలు రామలక్ష్మి, వీరభద్రరావు తమ్ముడి భార్య వెంకట భాగ్యలక్ష్మి, ఆమె కుమార్తెలు, భారతి, గీత, పిల్లలు వున్నారు.