April 24, 2013

పోటెత్తిన అనకాపల్లి

అనకాపల్లి/కశింకోట):తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు అనకాపల్లి నీరాజనాలు పలికింది. యువత, మహిళలు, అభిమానులు చంద్రబాబు వెంట నడిచారు. మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆయన ప్రసంగాలకు జనం నుంచి అపూర్వ స్పందన లభించింది. దీంతో చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తుతూ స్థానిక సమస్యలను కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎక్కువగా ప్రస్తావించారు. రాత్రి పదిన్నర గంటలప్రాంతంలో అనకాపల్లి నెహ్రూచౌక్‌కు చేరుకోగా అప్పటికే నాలుగు వైపులా రహదారులు జనంతో కిక్కిరిసిపోయాయి.

'వస్తున్నా మీకోసం' యాత్రలో భాగంగా చంద్రబాబు విశాఖ జిల్లాలో అడుగుపెట్టి మంగళవారానికి 11 రోజులైంది. రోజురోజుకీ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నది. అనకాపల్లి నియోజకవర్గంలో మూడు రోజుల క్రితం అడుగిడిన చంద్రబాబు మంగళవారం కశింకోట వద్ద నియోజకవర్గ ఇన్‌చార్జి దాడి రత్నాకర్ పూర్ణకుంభంతో స్వాగతం పలకడంతో పాదయాత్రను ప్రారంభించారు. కశింకోట నుంచి అనకాపల్లి వరకు జాతీయ రహదారి పొడవునా జనం ఆయన వెంట నడిచారు. వాహనాల్లో వెళుతున్నవారు చంద్రబాబును చూసి చేతులూపుతూ అభివాదం చేశారు. పలువురు సెల్ ఫోన్‌లతో ఫొటోలు తీసుకున్నారు.

పలుచోట్ల చిన్నారులను ఎత్తుకుని ముద్దాడారు. చంద్రబాబుతో కరచలనం చేసేందుకు మహిళలు పోటీ పడ్డారు. వృద్ధులు తమ గోడు చెప్పుకున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని పలువురు రైతులు చెప్పగా, అధికారంలోకి వచ్చిన వెంటనే పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తానని హమీ ఇచ్చారు. కశింకోట, పిసినికాడ, కొత్తూరు జంక్షన్, ఉమ్మలాడ, పూడిమడక బైపాస్, నెహ్రూచౌక్, చిననాలుగురోడ్ల జంక్షన్, పార్కు సెంటర్ మీదుగా పాదయాత్ర కొనసాగింది. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా వేలాదిమంది చంద్రబాబును చూసేందుకు తరలివచ్చారు.

ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి చంద్రబాబుతోపాటు స్థానిక నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు కూడా ప్రజలను ఆకట్టుకునే శైలిలో ప్రసంగించారు. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తున్నారు. దీంతో ప్రజలు ఆయన ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. సిమ్స్ సంస్థ దగాను, ఇసుకమాఫియా కారణంగా శారదానది గ్రోయిన్లు దెబ్బతింటున్న అంశాన్ని చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో చంద్రబాబు మరిన్ని స్థానిక సమస్యలను ప్రస్తావించడానికి ఆసక్తి చూపారు. మరుగు సమస్య కారణంగా మహిళలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. దారిలో తనకు వేచి వున్న మహిళలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు.

వారి నుంచి హారతులను స్వీకరించారు. తెలుగుదే
శం అధికారంలోకి వస్తే సమస్యలను ఎలా పరిష్కరిస్తానో వివరించారు. అనకాపల్లిలో పట్టణ ప్రజల సమస్యలు, బెల్లం ధర, రైతుల ఇబ్బందులపై చంద్రబాబు మాట్లాడారు. అనకాపల్లి రింగురోడ్డు జంక్షన్‌కు బాబు చేరుకునే సమయానికి అధికసంఖ్యలో జనం హాజరయ్యారు.

పాదయాత్రలో చంద్రబాబు వెంట నందమూరి తారకరత్నతోపాటు టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్, పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి బండారు, రెడ్డి సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కేఎస్ఎన్ఎస్ రాజు, గవిరెడ్డి రామానాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, అనకాపల్లి నియోజకవర్గం నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, గుత్తా ప్రభాకరచౌదరి, కశింకోట నాయకులు నిమ్మదల త్రినాథరావు, పొన్నగంటి నూకరాజు, వేగి గోపీకృష్ణ, పెదపాటి కళ్యాణి, వేగి దొరబాబు, షేక్ బాబరు, పెంటకోట రాము, బొబ్బిలి సీతారామ్, గొంతిన లోవఅప్పారావు, వేగి ప్రకాష్, ముప్పిడి అప్పారావు, మళ్ల సూర్యారావు, బత్తిన వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.