April 24, 2013

పేదలకు నామం.. సోనియాకు సలాం..............సమస్యలొదిలేసి గాలిలో షికార్లు!

పని నాస్తి..ప్రగల్భాలు జాస్తి
ప్రజలకు భయపడి హెలికాప్టర్‌లో ప్రయాణం
సీఎం కిరణ్‌పై చంద్రబాబు ఫైర్



కాపుల్లో ఎక్కువ మంది పేదలున్నారని, అధికారంలోకి వస్తే వారందరికీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐతే రిజర్వేషన్ అమలుకు శాస్త్రీయంగా సర్వే జరపాల్సి ఉంటుందని, అప్పటివరకూ ఐదు వేల కోట్లతో ఒక ప్యాకేజీ అమలు చేస్తామని చెప్పారు. విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా చేస్తానని సీహెచ్ ఎన్ అగ్రహారంలో జరిగిన సభలో ప్రకటించారు. ఈ ప్రాంతంలో చదువుకున్న ప్రతి యువకునికి స్థానికంగానే ఉద్యోగం వచ్చేలా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనకాపల్లి ఎంపీ సబ్బం హరి గురించి తెలుసా?' అని ఈ సమయంలో చంద్రబాబు ప్రజలను అడగగా, 'మా ఎంపీ కనిపించడం లేద'ని వారు జవాబిచ్చారు. రోజుకొకపార్టీ మారే ఆయారాం...గయారాంగా సదరు ఎంపీ మారాడని చంద్రబాబు అన్నప్పుడు ప్రజలు హర్షధ్వానాలు చేశారు. పిల్ల కాంగ్రెస్‌కి చంచల్‌గూడ జైలే పార్టీ కార్యాలయంగా మారిందని బాటజంగాలపాలెం సభలో ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు ప్రజలను అన్ని రకాలుగా దోచుకుని రాబందుల్లా బలిసిపోయారని రేబాక సభలో అన్నారు.

దోపిడీలో కిరణ్...వైఎస్ వారసుడిగా మారిపోయారన్నారు. కర్ణాటక ఎన్నికలకు రాష్ట్రం నుంచి భారీగా నిధులు తరలిస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో తృతీయ ఫ్రంట్‌దే అధికారమని జోస్యం చెప్పారు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ఆడపిల్లలకు చదువు, భద్రతకు బాధ్యత వహించేలా పథకం రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. ఉపాధి కరువై తల్లిదండ్రులకు భారంగా మారిన నిరుద్యోగ యువతను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వస్తే డ్వాక్రా మహిళలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కాగా, విశా ఖలో చేపట్టిన 'పాదయాత్ర' పైలాన్ నిర్మాణం పూర్తయింది. శనివారం ఆంధ్రా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ముగిం పు సభ ఏర్పాట్లను నేతలు తుమ్మల, యనమల, గరికి పాటి పరిశీలించారు.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమస్యలను గాలికొదిలి హెలికాప్టర్‌లో తిరుగుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల మధ్యకు రావడానికి ధైర్యం చాలక గాలిలో షికార్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సీహెచ్ఎన్ అగ్రహారంలో బుధవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పోరాడి పోరాడి అలసిపోతే...వారు మాత్రం దిగమింగి దిగమింగి బాగా బలిసిపోయారని వ్యాఖ్యానించారు. ప్రజలకు కాకుండా సోనియాకు కిరణ్ జవాబుదారీగా ఉంటున్నారని, ఢిల్లీకి సలామ్ కొడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలు దద్దమ్మల్లా తయారయ్యాయని దుయ్యబట్టారు.