April 23, 2013

అలుపెరుగని బాటసారి

విశాఖపట్నం/కశింకోట/ఎలమంచిలి
: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు సుమారు ఏడు నెలల నుంచి అలుపెరగకుండా పాదయాత్ర చేస్తున్నప్పటికీ ఆయనలో ఎటువంటి అలసట కనిపించడం లేదు. పైగా ఆయనో కొత్త ఉత్సాహం ఉరకలేస్తున్నది. కాళ్లు నొప్పులు పెడుతున్నండడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెబుతున్నప్పటికీ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఆరోగ్యపరమైన ఇబ్బందులను సైతం లెక్కచేయడం లేదు. చంద్రబాబు పాదయాత్ర విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన తరువాత చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. ఆయన వర్షంలో తడుస్తూనే పాదయాత్రను కొనసాగిస్తున్నారు. దీంతో గొంతు కొంచెం బొంగురుపోయింది.

అయినప్పటికీ ఆయన ప్రజా సమస్యలపైనా, కాంగ్రెస్ పాలకుల అవినీతిపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూనే వున్నారు. ఆయన ప్రసంగానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. పాదయాత్ర చేస్తున్న రహదారికి ఇరుపక్కల ఉన్న గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై బాబుకు సంఘీభావం తెలుపుతున్నారు. మహిళలు హారతులు ఇచ్చి నుదుట తిలకం దిద్దుతున్నారు. చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో తాళ్లపాలెం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అంతకు గంటన్నర ముందు వర్షం పడడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.

దీంతో వేలాది మంది ప్రజలు ఆయన వెంట నడుస్తూ ముందుకు సాగారు. ఉగ్గినపాలెం, పరవాడపాలెం, జమాదులపాలెం, బయ్యవరం మీదుగా రాత్రి 11.30 గంటలకు కశింకోట ఆర్ఈసీఎస్‌కు చేరుకుని రాత్రి బసచేశారు. అంతకు ఉగ్గినపాలెం జంక్షన్ వద్ద ఆయన ప్రసంగించగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో ఆయన ఇక్కడ అర్ధగంటకుపైగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైసీపీ అవినీతి దోపిడీని ఎండగడుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తరచూ దగ్గు వస్తున్నప్పటికీ ప్రసంగాన్ని మాత్రం ఆపలేదు. 'వర్షంలో తడవడం వల్ల గొంతు బొంగురు పోయింది. అయినా నా గొంతుకు ఏమీ కాదులే'' అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు.

తాళ్లపాలెం నుంచి ఉగ్గినపాలెం జంక్షన్ వరకు పాదయాత్ర చేయడానికి సుమారు గంటన్నర సమయం పట్టింది. ఎటువంటి అలసట లేకుండా చురుగ్గా అడుగులో అడుగేసుకుంటూ ముందుకు సాగారు. దారిలో తనను కలవడానికి వేచి వున్న చేతివృత్తి కార్మికులను, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సాధకబాధలను తెలుసుకున్నారు. పసిపిల్లలను ఎత్తుకుని ముద్దాడారు. ఉగ్గినపాలెం వద్ద బాబు ట్రాక్టర్ నడిపారు. కొద్దిసేపు ఒక ఆటోలో కూర్చొని ్రడైవింగ్ చేస్తూ అభివాదం చేశారు. జాతీయ రహదారిపై ఆగివున్న లారీలోకి ఉత్సాహంగా ఎక్కి, కొద్దిసేపు ్రడైవర్ సీటులో కూర్చుని స్టీరింగ్ పట్టుకున్నారు.

ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులను పలకరిస్తూ ముందుకు కదిలారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌తోపాటు టీఆర్ఎస్‌పైనా విమర్శలు గుప్పించారు. అదే విధంగా స్థానిక సమస్యలను ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో తన హయాంలో జరిగిన అభివృద్ధితో ప్రస్తుత అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వారి మాయ మాటలను నమ్మి మోసపోవద్దని, తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చాలని కోరారు. వైసీపీకి కేరాఫ్ అడ్రస్ చంచల్‌గుడ జైలు కాగా, కాంగ్రెస్ నాయకులు, మంత్రులంతా సీబీఐ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. వైఎస్ పాలన్ల, కేసీఆర్ వైఖరి వల్ల రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందన్నారు. తెలుగుదేశం పార్టీని మహిళలు, యువత బాగా ఆదరిస్తున్నారని అన్నారు.

ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి, తదితర నాయకురాళ్లు చంద్రబాబు వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. దారిలో చెరకు రైతులు, కల్లు గీత కార్మికులు తమ సమస్యలను చెప్పుకున్నారు. గమేళాలు తయారు చేసే చోటుకు వెళ్లి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, కొణతాల మురళీకృష్ణ, మళ్ల సురేంద్ర, గుత్తా ప్రభాకరచౌదరి, నిమ్మదల త్రినాథరావు, పొన్నగంటి నూకరాజు, గొంతిన లోవ అప్పారావు, వేగి గోపీకృష్ణ, మజ్జి నిరంజన్‌కుమార్, కూండ్రపు అక్కునాయుడు, వేగి దొరబాబు, కె. ఈశ్వర అప్పారావు, షేక్ బాదర్, పెంటకోట రాము, దొడ్డి బుద్ద సత్యనారాయణ, బొబ్బిలి సీతారాం, కొంతం ఆదినారాయణ, అందే రమణ, మళ్ల సూర్యారావు పాదయత్రలో పాల్గొన్నారు.