April 23, 2013

కేసీఆర్ ఖబడ్దార్ నీదే తాగుబోతుల పార్టీ

ఉద్యమ ద్రోహివి,గల్ఫ్ బ్రోకర్‌వి,పొలిటికల్ లోఫర్‌వి
ఆధారాలతో నిరూపిస్తాం: టీడీపీ

(న్యూస్ నెట్‌వర్క్) టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై టీడీపీ విరుచుకుపడింది. తమ పార్టీ అధినేతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌ను దుయ్యబట్టింది. "నీది తాగుబోతుల పార్టీ. వసూళ్ల పార్టీ. ఫాం హౌస్ పార్టీ. తాగి ఊగే పార్టీ. తాగకుండా ఉండలేని పార్టీ. తెగ తాగి ఫాం హౌస్‌లో పడుకొనే పార్టీ'' అంటూ ఎమ్మెల్సీ అరిగెల నర్సారెడ్డి ధ్వజమెత్తారు. తమది పాలు, కూరగాయలు అమ్ముకొనే పార్టీ అని కేసీఆర్ అంటున్నాడని, అది నిజం అనుకున్నా తమది స్కాములు, బ్లాక్ మెయిళ్లు, దోపిడీ వ్యవహారాల పార్టీ మాత్రం కాదని దుయ్యట్టారు. " మాది బిర్యానీ, బీర్ల పార్టీ కాదు.

కూతురు సినిమా పరిశ్రమను, కొడుకు పరిశ్రమలను, అల్లుడు విద్యా సంస్థలను పంచుకొని పిండి వసూళ్లు చేస్తుంటే తండ్రి ప్రాజెక్టులను కొల్లగొడుతున్నాడు. నాలుగు చేతులా సంపాదన. నీదొక పార్టీ...నువ్వొక నాయకుడివా?'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారంపై పార్లమెంటులో చర్చ జరిగితే కేసీఆర్ ఆ ఛాయలకే పోలేదని, బ్రదర్ అనిల్‌కు బయ్యారం భూములను కేటాయించడాన్ని నిరసిస్తూ చంద్రబాబు అక్కడకు వెళ్తే ఉద్యమం ముసుగులో ఆయనను అడ్డుకొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మరోవైపు కేసీఆర్ గల్ఫ్ బ్రోకర్, పొలిటికల్ లోఫర్ అని టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ధ్వజమెత్తారు.

ఫాం హౌస్‌లో గ్లాసులు ఎత్తడం కాదు... పార్లమెంట్‌లో గొంతు ఎత్తడం నేర్చుకోవాలని అని సూచించారు. 'కేసీఆర్‌ది అంతా చందాల దందా. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని పెద్ద ఎత్తున వసూళ్ళకు పాల్పడుతున్నాడ'ని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. కేసీఆర్‌పై ఆరోపణలు నిరూపించడడానికి తమ దగ్గర ఆధారాలున్నాయని, దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఓబుళాపురం గనులు కేటాయించాలని, ఆ గనుల లీజు రద్దు అయినందున వాటిని విశాఖ ఉక్కుకు కేటాయించాలని తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

బయ్యారం ఇనుప ఖనిజం దోపిడీపై ఖమ్మం జిల్లా ప్రజలకు షర్మిల క్షమాపణలు చెప్పాలని ఆ జిల్లా టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. టీడీపీ అధినేతపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మొవ్వా విజయ్‌బాబు మండిపడ్డారు. బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా డిమాండ్ చేస్తున్నది. కరీంనగర్‌లో జరుగుతున్న ఫార్వర్డ్ బ్లాక్ ప్రథమ రాష్ట్ర మహాసభల సందర్భంగా రెండో రోజు సోమవారం ప్రతినిధుల సభ జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.