April 23, 2013

కేసీఆర్ భాష మార్చుకో..: అన్నపూర్ణమ్మ

నిజామాబాద్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తన భాష మార్చుకోవాలని, ఆయన మాట్లాడుతున్న భాషను చూసి తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ధ్వజమెత్తారు. సోమవారం ఆమె 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై కేసీఆర్ వ్యక్తిగత విమర్శలు చేశారని, ఆయన వాడిన భాషను చూసి తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. కేసీఆర్ వాడిన పదజాలాన్ని వెనక్కి తీసుకోవాలని, భాషను మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఫాం హౌజ్‌పార్టీ అని, కేసీఆర్ ఆరు నెలల పాటు ఫాంహౌజ్‌లో కుంభకర్ణుడిలా నిద్రపోయి తరువాత వచ్చి టీడీపీపై విమర్శలు చేస్తుంటారని, ఫాంహౌజ్‌లో ఉండే కేసీఆర్‌కు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.

సూట్‌కేసులు తీసుకునే ఘన చరిత్ర కేసీఆర్‌కు సొంతమని, సూట్‌కేసులు తీసుకుని సకల జనుల సమ్మెను తాకట్టుపెట్టిన చరిత్ర కేసీఆర్‌కు ఉందన్నారు. టీడీపీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడంతో నల్ల ముఖంతో కేసీఆర్ ఆరు నెలలు ఏం మాట్లాడలేదని, టీడీపీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీతో పాటు మరో 11 ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేయలేదన్నారు. తెలంగాణలోని భూములు ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడినా కేసీఆర్ ఎందుకు స్పందించలేదన్నారు. బయ్యారం గనులు ఆ ప్రాంత గిరిజనులకే చెందాలంటూ అనేక ఆందోళనలు చేపట్టామని, అప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా పిట్టల దొరలా మాట్లాడే కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. 2009 ఎన్నికల్లో 46 అసెంబ్లీ స్థానాలను టీడీపీ కేటాయిస్తే సూట్ కేసులు నిండా డబ్బులు తీసుకుని, టిక్కెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. బాబ్లీ, బయ్యారం గనులపై కేసీఆర్ చేసిన పోరాటాలు ఏంటో చెప్పాలని, బహిరంగ చర్చకు రమ్మని ఎన్నిసార్లు సవాళ్లు విసిరినా తప్పించుకుని తిరుగుతున్నాడని ఆమె ఆరోపించారు.