April 23, 2013

విశాఖపట్నమంటే తనకు ఎనలేని అభిమానం


విశాఖపట్నం, (కశింకోట) : విశాఖపట్నమంటే తనకు ఎనలేని అభిమానం, ఇష్టమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు అన్నారు. ఒకపక్క సముద్రం, మూడు పక్కల కొండలతో విశాఖ అందాలు అద్భుతమన్నారు. మీకోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా తాళ్లపాలెంలో విశాఖ దక్షిణం, పశ్చిమ నియోజకవర్గాల కార్యకర్తలతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో ఉండేందుకు తానెంతో ఇష్టపడతానన్నారు. తన హయాంలోనే విశాఖ బాగా అభివృద్ధి చెందిందని, మరింత అభివృద్ధి చేయాలని ప్రణాళిక చేశామని, కొన్ని అడ్డంకుల వల్ల అది సాధ్యం కాలేదన్నారు.

హైదరాబాద్ ర్రాష్టానికి రాజధాని అయితే విశాఖ ఆర్థిక రాజధానిగా చేయాలని నిర్ణయించామన్నారు. విశాఖలోని సింహాచలం కొండను అభివృద్ధి చేసేందుకు ఎరుపు, పసుపు, పచ్చని పూలనిచ్చే తోటలను పెంచితే ఎంతో బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కైలాసగిరి కొండపై రోప్‌వే, కంబాలకొండకు మరో రోప్‌వే ఏర్పాటు చేయాలనుకున్నామన్నారు. ఇక్కడికి వస్తే ఎంతో ఆనందం, ఉత్సాహం కలుగుతాయన్నారు. ఇక్కడ హెచ్ఎస్‌బీసీని తానే తీసుకొచ్చానని, దీనివల్ల అనేకమందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. కొన్ని పరిశ్రమలు ఏర్పాటైనప్పటికీ ఉపాధి కరువైందన్నారు. విశాఖలో కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉందని, దానిని లేకుండా చేస్తే ప్రపంచంలోనే మంచి నగరంగా రూపుదిద్దుకుంటుందన్నారు.

ఇక్కడి భూములను పిల్లకాంగ్రెస్ తండ్రి అమ్మేసి దోచుకుందని ఆరోపించారు. టీడీపీకి విశాఖపట్నం కంచుకోట అని, ఇక్కడ పార్టీకి మంచి పట్టు ఉందని అభిమానించే కార్యకర్తలున్నారన్నారు. ఇక్కడ తటస్థు ఓటర్లు ఎక్కువగా వున్నారని, బూత్‌లవారీగా ఓటర్లను కలుసుకొని తటస్థ ఓటర్లను గుర్తిస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చునన్నారు. పట్టణ ఓటర్లు ప్రభుత్వ వ్యతిరేకతపై మొగ్గు చూపుతారని, రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను వారికి చెప్పి తమ వైపు తిప్పుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్, పశ్చిమ ఇన్‌చార్జి గణబాబు, రూరల్‌జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్, టీడీపీ నాయకులు వానపల్లి రఘకుమార్, కె.విజయలక్ష్మి, బి.వరలక్ష్మి, పెంటకోట వీరలక్ష్మి, పెంటకోట త్రినాథ్, సరిపల్లి సీతారామరాజు, శీరం పైడిరాజు, వర్మ, జయరాజ్, మళ్ల శంకరరావు, వియ్యపు శ్రీనివాసరావు, బొట్టా పరదేశి, ఐతా మాణిక్యం, సూర్యనారాయణ, అన్నంరెడ్డిరాణి, వాసుదేవరావు, నర్గీష్, స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.