April 23, 2013

టీఆర్ఎస్ వల్లే రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది: బాబు ఫైర్

అది బ్లాక్‌మెయిల్,సూట్‌కేసుల పార్టీ

అవినీతిపై మాట్లాడే హక్కు టీఆర్ఎస్‌కు లేదని చంద్రబాబు ుండిపడ్డారు. అవినీతిపై మాట్లాడలేనిస్థితిలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా నిద్రలేచి రంకెలేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ వల్లే రాష్ట్రం భ్రష్టుపట్టిందని ఉగ్గినవానిపాలెంలో జరిగిన సభలోమండిపడ్డారు. ఇప్పటివరకూ ఆ పార్టీ పేరు చెప్పకుండా సాదాసీదాగా మాట్లాడానని, అందుకే తనపై విరుచుకుపడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

వారికి ఎప్పుడో ఒకసారి ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయన్నారు. వైఎస్ హయాంలో ఎప్పుడూ అవినీతి గురించి మాట్లాడలేదని విమర్శించారు. బయ్యారంలో వైఎస్ అల్లుడికి గనులు ధారాదత్తం చేస్తే అప్పుడు టీఆర్ఎస్ మౌనంగా ఉందని ఆరోపించారు. టీడీపీ ఈ విషయాన్ని అప్పుడే వెల్లడించిందని, ఎక్కడ గనులుంటే అక్కడే కర్మాగారాలు పెట్టాలని డిమాండ్ చేసిందన్నారు. గిరిజనులకు పూర్తిగా ఉపాధి కల్పించాలని బయ్యారంలో తాము ఆందోళన కూడా చేపట్టామని గుర్తుచేశారు.

అప్పుడు నిద్రపోయిన టీఆర్ఎస్, ఇప్పుడు టీడీపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. "అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ చెబుతున్నాం అది పూర్తిగా బ్లాక్‌మెయిల్ పార్టీ.. సూట్‌కేసుల పార్టీ'' అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. 2009లో ఎన్నికల పొత్తు అంటూ తన దగ్గరకు వస్తే టీడీపీ సీట్లు ఇచ్చామని, అయినా ఆ పార్టీ గెలవలేకపోయిందని చెప్పారు. సూట్‌కేసులు తీసుకొని రాజకీయాలు చేస్తున్నది టీఆర్ఎస్ తప్ప తెలుగుదేశం కాదన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం తాము కృషిచేస్తుంటే, ఆ పార్టీ సూట్‌కేసులతో రాజకీయం చేస్తోందని పేర్కొన్నారు.