April 23, 2013

నర్సీపట్నం అభ్యర్థిత్వంపై ఊగిసలాటకు తెర

నర్సీపట్నం: వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం అసెంబ్లీ నియోజకర్గం నుంచి టీడీపీ అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చేసింది. టీడీపీ అభ్యర్థిగా అయ్యన్నపాత్రుడు తిరిగి పోటీ చేస్తారా? లేక ఆయన తనయుడు విజయ్‌ను రంగంలోకి దించుతారా? అనే ఊగిసలాట ప్రచారానికి తెర దిగింది. సోమవారం చంద్రబాబు తెరదించినట్టయింది. అయ్యన్నపాత్రుడు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. సమీక్షలో అయ్యన్ననను ఎంత మెజార్టీతో గెలిపిస్తారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నర్సీపట్నం నియోజకవర్గ ముఖ్య నేతలను ప్రశ్నంచడం ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నది. కశింకోట మండలం తాళ్లపాలెంలో నర్సీపట్నం నియోజకవర్గ ముఖ్య నాయకులతో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు సోమవారం సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి హాజరైన కొందరు టీడీపీ నాయకులు 'ఆంధ్రజ్యోతి'కి అందజేసిన వివరాలిలా ఉన్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు సవివరంగా సమీక్ష జరిపారు. ప్రస్తుతం నర్సీపట్నం నియోజవకర్గంలో టీడీపీ గెలుపు ఖాయమని, అయితే వచ్చే ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడికి ఎంత మెజార్టీ తేగలరో చెప్పాలని పార్టీ మండల శాఖల అధ్యక్షులను చంద్రబాబు ప్రశ్నించారు.

విశాఖ జిల్లాలో తొలుతగా నర్సీపట్నం నియోజకవర్గంలో వారం రోజులకుపైగా జరిగిన వస్తున్నా... మీకోసం పాదయాత్రను దిగ్విజయం చేసినందులకు పార్టీ నాలుగు మండలాలు, అర్బన్ శాఖ అధ్యక్షులను, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడును, అతని తనయుడు విజయ్‌ను చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 27న విశాఖలో జరగనున్న ముగింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేందుకు కృషి చేయాలని నర్సీపట్నం నియోజవకర్గ నేతలను బాబు కోరారు.

కోర్ కమిటీలదే కీలకపాత్ర నియోజకవర్గాల్లో పార్టీ కోర్ కమిటీలు భవిష్యత్‌లో కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని, పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానంగా ఉంటూ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లోని ప్రతీ గ్రామంలో పార్టీ పరిస్థితిని, పరిణామాలను తెలియజేయాల్సి ఉంటుందని చంద్రబాబునాయుడు నర్సీపట్నం నియోజకవర్గ నేతలకు సూచించారు. కేవలం ఎమ్మెల్యే ఎన్నికలపైనే కాకుండా ఎంపీ ఎన్నికలపై కూడా శ్రద్ద వహించాలని, అత్యధిక ఎంపీ స్థానాలను పార్టీ గెలుచుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాబు కోరారు.

ఎంపీ అభ్యర్థుల ఎంపికలో శ్రద్ధ అవసరం టీడీపీ తరపున రాష్ట్రంలో ఎంపీ స్థానాలకు సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పార్టీ అధినేతను కోరారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేసేవారికే ఎంపీ అభ్యర్థులుగా టిక్కెట్లు ఇవ్వాలని ఆయన సూచించారు. తగిన గుణగణాలు, మంచిపేరు ఉన్న వ్యక్తులు దొరకాలి కదా! అంటూ చంద్రబాబు బదులిస్తూ, విజయావకాశాలు గల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల వడపోత ప్రారంభించామంటూ సూచనప్రాయంగా తెలిపారు.

విజయ్‌కు కితాబు యువకుడైన విజయ్ మంచి వాగ్ధాటి అని చంద్రబాబు కితాబు ఇచ్చారు. అతడిని నియోజకవర్గంలో పార్టీ పటిష్ఠతకు, ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాల్సిందిగా సూచించారు. విశాఖ జిల్లాలో వస్తున్నా... మీకోసం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి చంద్రబాబు వెన్నంటి ఉంటూ నడక కొనసాగస్తున్న అయ్యన్న తనయుడు విజయ్ తన ఉద్రేక ప్రసంగాలు, ఉద్విగ్న హవాభావాలు, ప్రత్యేక వ్యవహారశైలితో బాబును ఆకట్టుకున్నారు.

దీంతో ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా కాకుండా ఇతరత్రా విజయ్ సేవలను ఉపయోగించుకోవాలనే యోచన అధినేత చంద్రబాబునాయుడులో ఉన్నట్టుగా విశిదమవుతుందని పార్టీవర్గాలు తెలిపాయి.

బాబు సమీక్షలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, నర్సీపట్నం మున్సిపాలిటీ శాఖ అధ్యక్షుడు చింతకాయల సన్యాసిపాత్రుడు, నర్సీపట్నం మండల శాఖ అధ్యక్షుడు లాలం శ్రీరంగస్వామి, గొలుగొండ మండలశాఖ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, నాతవరం మండలశాఖ అధ్యక్షుడు లాలం అచ్చిరాజు, మాకవరపాలెం మండలశాఖ అధ్యక్షుడు రుత్తల శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు.