April 4, 2013

వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలిచి తీరాలి

జెండా ఎన్నాళ్లు మోస్తాం!
అసెంబ్లీ, పార్లమెంటుకు సైకిల్ దూసుకుపోవాలి
టీడీపీ గెలుపు చారిత్రక అవసరం
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు
కాళ్ల నొప్పులు ఓర్చుకుంటూ నడక



 "మనలో ఉన్న పట్టుదలకు కసి తోడవ్వాలి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలిచి తీరాలి.. మీరంతా కష్టాల్లో ఉన్నారు.. అధికారంలో లేకపోయినా తొమ్మిదేళ్లుగా జెండాలు మోస్తున్నారు.. ఎన్నాళ్లని మోస్తూ కూర్చుంటాం.. అధికారం వస్తేనే ప్రజలకు న్యాయం చేయగలం..'' అని చంద్రబాబు అన్నారు. 'వస్తున్నా మీ కోసం..' పాదయాత్ర గురువారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో సాగింది.

పాదయాత్రలో చంద్రబాబు తనను కలిసిన భవన నిర్మాణ కార్మికులు, రైతులు, మహిళలు, వ్యవసాయ కూలీలతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని, వేరే పని చేతకాదని చేబ్రోలులో ఒక కౌలురైతు బాబుకు విన్నవించుకున్నారు. దాంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు ఇప్పిస్తామని బాబు హామీ ఇచ్చారు. బెల్టుషాపులను ఎత్తివేయించి.. వారికి వేరే ఉపాధి కల్పిస్తామన్నారు. పిఠాపురం మండలం తాటిపర్తి సెంటర్‌లో అనపర్తి, పిఠాపురం నియోజకవర్గాల కార్యకర్తల సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలని, టీడీపీ గెలుపు ఒక చారిత్రక అవసరమని స్పష్టం చేశారు. "ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు ఏడాదిలో రావచ్చు. ఆరు నెలల్లోనైనా రావచ్చు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటులకు సైకిల్ దూసుకుపోవాలన్నారు. జెండాలు మోసీమోసీ భుజాలు అరిగిపోయాయని, ఇక అధికారంలోకి రావడ ం తప్పనిసరని చంద్రబాబు పేర్కొన్నారు.

"పిఠాపురంలో కొందరు ఇతరపార్టీల నుంచి మన పార్టీలోకి రానివ్వడం లేదు. ఇన్‌చార్జి మొహమాటంతో వారినేమీ అనలేకపోతున్నారు..'' అని సూర్యప్రకాష్ అనే కార్యకర్త చంద్రబాబుతో అన్నారు. దాంతో.. ఎంత సమర్థుడైన నాయకుడైనా మొహమాటం వదులుకోకపోతే ఇబ్బందులు తప్పవని... తాను చాలావరకు మొహమాటాలు వదులుకున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.