April 4, 2013

టీడీపీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడి

హనుమాన్ జంక్షన్: విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా బుధవారం హనుమాన్‌జంక్షన్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను టీడీపీ నాయకులు ముట్టడించారు. తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, మండల టీడీపీ ఆధ్వర్యంలో విద్యుత్‌చార్జీల పెంపునకు నిరసనగా పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలతో పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా విద్యుత్‌సబ్‌స్టేషన్‌కు చేరుకున్నారు. విద్యుత్ కార్యాలయ ఉద్యోగుల విధులకు కొద్దిసేపు ఆటంకం కలిగించారు.

పలువురు మహిళలు తమ గృహాల నుంచి టీవీలు, ఫ్రిజ్ లు, మిక్సీలు, ఫ్యాన్లు, వాషింగ్ మిష న్లు, సబ్‌స్టేషన్‌కు తీసుకువచ్చి అం దరి సమక్షంలో తగులబెట్టారు. తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం చార్జీలు తగ్గించకపోతే వినియోగదారులు ఎవ్వరూ బిల్లులు కట్టరని, కట్టమని అధికారులు చెబితే వారిని నిర్బంధిస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం దిగి వచ్చేవరకు విద్యుత్ బిల్లులు కట్టవద్దని ఆయన పిలుపునిచ్చారు.

మండల టీడీపీ అధ్యక్షుడు కలపాల జగన్‌మోహన్‌రావు, రాష్ట్ర తెలుగు రైతు సభ్యుడు గుండపనేని ఉమా వరప్రసాద్, ఆళ్ళవెంకట గోపాల కృష్ణారావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వేగిరెడ్డిపాపారావు, వేములపల్లి శ్రీనివాసరావు,చిరుమామిళ్ళ సూర్యనారాయణ ప్రసాద్, మాజీ ఎంపీపీ సభ్యుడు తట్టి అర్జున్‌రావు, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి శివయ్య, మజ్జిగ నాగరాజు, కానుమోలు మాజీ సర్పంచ్ దుర్గారావు, శ్రీనివాసరావు, దళిత నాయకులు దయాల రాజేశ్వరరావు, దాసరి వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.