April 4, 2013

ఉప్పొంగిన జనకెరటం

పిఠాపురం: జనకెరటం ఉప్పొంగింది.. భారీగా తరలివచ్చిన జనసందోహం మధ్య టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్ర సాగింది. బుధవారం సాయంత్రం పిఠాపురం బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర జీవన్‌నగర్, సీతయ్యగారి తోట, మునిసిపల్ కార్యాలయం సెంటర్, కోటగుమ్మం సెంటర్, పల్లపు వీధి, ఉప్పాడ సెంటర్, వన్‌వే ట్రాఫిక్ రోడ్డు, ఆర్ఆర్ పార్కు, చర్జి సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్సు, అగ్రహారం, పశువుల సంతమీదుగా సాగింది.

చంద్రబాబు పాదయాత్రతో పిఠాపురం పట్టణం జనసంద్రమైంది. ప్రజలు బారులు తీరి నీరాజనాలు పలికారు. ఎక్కడికక్కడ యువత, మహిళలు, వృద్ధులు చంద్రబాబు రాకకోసం ఆసక్తిగా ఎదురుచూడడం కనిపించింది. పట్టణ వీధలన్నీ పసుపుమయంగా మారాయి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో తరలివచ్చిన జనసందోహం వెంటరాగా చంద్రబాబు పాదయాత్రను ఉత్సాహంగా నిర్వహించారు. పాదయాత్రలో ఆయా వర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు.

సెలూన్‌కు వెళ్లి అక్కడ కటింగ్ చేశారు. టీ సెంటర్‌కు వెళ్లి టీ కాశారు. భవన నిర్మాణ పనులు చేస్తున్న వారి వద్దకు వెళ్లి కొంతసేపు తాపీ పని చేశారు. తోపుడు బండ ్ల వర్తకుల ఇబ్బందులు తెలుసుకున్నారు వారి ఇబ్బందులన్నింటినీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ముందుకు కదిలా రు. చంద్రబాబు పాదయాత్రకు వచ్చిన స్పందనతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. పాదయాత్రలో పార్టీ నేతలు ఎస్వీఎస్ఎన్ వర్మ, నిమ్మకాయల చినరాజప్ప, చిల్లా జగదీశ్వరీ, చిక్కాల రామచంద్రరావు, పోతుల విశ్వం పాల్గొన్నారు.

పార్టీలో చేరికలు

పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మొగలి వీరవెంకటసత్యనారాయణ(బాబ్జీ) టీడీపీలో చేరా రు. పిఠాపురంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ, పార్టీ జిల్లా కార్యదర్శి మాదేపల్లి రంగబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బాబ్జీకి చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ పటిష్టతకు పనిచేయాలని కోరారు. బాబ్జీతోపాటు పలువురు పార్టీలో చేరారు. పిఠాపురానికి చెందిన లోక్‌సత్తా నాయకుడు కొండేపూడి శంకరరావు తదితర పార్టీలో చేరగా చంద్రబాబు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

పైలాన్ ఆవిష్కరణ

టీడీపీ ఆవిర్భవించి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బైపాస్ రోడ్డులో నిర్మించిన 32 అడుగుల పైలాన్‌ను టీడీపీ అధినేత చ ంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భగా కేక్‌ను కట్ చేశారు. ఫైలాన్‌ను ఎంతో శ్రమకు ఓర్చి నిర్మించిన నియోజకవర్గ ఇన్‌చార్జి వర్మను బాబు అభినందించారు. తాను 29వ తేదీకే పిఠాపురం రావాల్సి ఉన్నా నాలుగురోజలు ఆలస్యంగా వచ్చానని తెలిపారు. పైలాన్ టీడీపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, గరికిపాటి మోహనరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు.