April 4, 2013

రైతుల ఉసురు తీస్తున్న ప్రభుత్వం

దుబ్బాక: రైతుల ఉసురు తీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య హెచ్చరించారు.దుబ్బాకలో టీడీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో కలిసి ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ, రైతు రాజ్యమని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారిని నిండాముంచిందన్నారు. విత్తనాలు, ఎరువుల కొరతతో రైతులు పడుతున్నారని చెప్పారు. వ్యవసాయానికి ఏడు గంటల పాటు నిరాంతరాయంగా కరెంటు అందిస్తామని చెప్పిన సర్కార్ గంటసేపు కూడా సరఫరా చేయడం లేదని విమర్శించారు.

అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను బస్టాండ్ వద్ద దహనం చేశారు. నిరాహార దీక్షలో తెలుగునాడు గీతాకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వామిగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు గొడుగుపల్లి రమేష్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు రవికుమార్, జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాస్, నర్సింహ్మారెడ్డి, రవీందర్, దామోదర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, చెన్నారెడ్డి, అరిగె సరోజన, రాపెల్లి లక్ష్మణ్, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం నిరహార దీక్షలు కరెంటు కోతలపై సోమవారం దుబ్బాకలో సీపీఎం నిరాహార దీక్ష చేపట్టింది. సీపీఎం డివిజన్ కార్యదర్శి గొడ్డుమల్ల భాస్కర్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్నికలకు ముందు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందన్నారు. కార్యక్రమంలో నాయకులు బండ్ల నర్సింలు, కాశయ్య, చంద్రారెడ్డి, ఆకుల భరత్, రాజిరెడ్డి, బాలయ్య, దేవయ్య, బిక్షపతి, వెంకన్న, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.