April 4, 2013

విద్యుత్ సంక్షోభానికి వైఎస్ఆరే కారణం

కారేపల్లి: రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడటానికి కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కారణమంటూ ఖమ్మం ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఆరోపించారు. మండల పరిధిలోని మేకల తండా గ్రా మంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ మన రాష్ట్రంలో సరిపోను విద్యుత్ సౌకర్యం ఉన్నప్పటికీ వైఎస్ తన బంధుమిత్రులకు లబ్ధి చేకూరేందుకు ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను విక్రయించాడని ఆరోపించారు.

రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుచేసేందుకు తన అనుకూలంగా ఉన్నవారికి అనుమతులు ఇచ్చారని దీంతో వారు తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే ఆవిద్యుత్ భారా న్ని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అనుభవించాల్సిన పరిస్థితి దాపురించిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 11సార్లు విద్యుత్ చార్జ్జిలను పెంచారని దీంతో ప్రజలు కోట్లాది రూపాయలు నెలసరిగా బిల్లులు చెల్లిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విద్యుత్ సమస్యలపై టీడీపీ ఆధ్వర్యంలో బ్లాక్‌పేపర్ రూపంలో కరపత్రాలను ప్రచురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వివరిస్తున్నట్లు ఆయన అన్నారు.

సంతకాలు సేకరించిన పోట్ల

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పదేపదే పెంచుతున్న విద్యుత్ చార్జీలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్ నరసింహాన్‌కు సమర్పించనున్నట్లు పోట్ల అన్నారు.

గత టీడీపీ ప్రభుత్వంలో రైతులపై ఎలాంటి విద్యుత్ చార్జీలను పెంచకుండా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి 9గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినట్లు ఆయన అన్నారు.

కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఉన్నం వీరేందర్, మాజీ ఎంపీపీ బాణోత్ దేవ్లానాయక్, పాలిక సారయ్య, బత్తుల శ్రీనివాసరావు, అడ్డగోల ఐలయ్య, ఎండి హనీఫ్, ఆంగోత్ మత్రు, నూనావత్ వశ్రామ్, భూక్యా బాలాజీ, ఆంగోత్ శంకర్, భూక్యా కబీర్, చాగంటి కోటయ్య, తాత వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.