April 15, 2013

అంగరక్షక్షుల సాయంతో నడక చంద్రబాబుకు తీవ్రమైన కాలి నొప్పి

నర్సీపట్నం: చంద్రుడి వదనం వాడిపోయింది. అడుగుల వేగం తగ్గిపోయింది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కాళ్ల నొప్పి తీవ్రమైంది. అంగరక్షకుల సాయంతో అడుగులో అడుగేస్తూ నడవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలి వేళ్లతోపాటు కండరాల నొప్పి కూడా తీవ్రం కావడంతో... వైద్యుల సలహా మేరకు ఆయన శనివారం నుంచి విశాఖ జిల్లా శృంగవరం గ్రామ శివార్లలోని కొబ్బరితోటలో ఏర్పాటుచేసిన తాత్కాలిక బసలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా బస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా వేదికపైకి వచ్చేందుకు చంద్రబాబు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. తాను విశ్రాంతి తీసుకుంటున్న బస్సు నుంచి దిగేందుకు, ఆ తర్వాత వేదిక వరకు నడిచేందుకు అంగరక్షకుల సహాయం తీసుకున్నారు. అడుగులో అడుగు వేసుకుంటూ వేదికపైకి వచ్చారు. లుంగీ కట్టుకుని, కాళ్లకు మేజోళ్లు తొడుక్కున్న ఆయన వేదికపై తన ఎడమకాలుని ఓ పీటపైనే ఉంచి కూర్చోగలిగారు. హుషారుగా ఉండే చంద్రబాబు ఆదివారం నీరసంగా, బలహీనంగా కనిపించారు. శనివారం మధ్యాహ్నం ఇక్కడకు చేరుకున్న ఆయన సతీమణి భువనేశ్వరి.. ఆదివారం కూడా చంద్రబాబు చెంతనే ఉండి సపర్యలు చేశారు.

అడుగు ముందుకే...
ఆరున్నర నెలలుగా పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు ప్రస్తుతం నడవడమే కష్టంగా మారింది. శుక్రవారం విశాఖ జిల్లాలో పాదయాత్ర ప్రారంభం కావడానికి ముందు చంద్రబాబును పరీక్షించిన వైద్యులు.. ఎట్టిపరిస్థితిలోనూ నడవడానికి వీలులేదని చెప్పారు. అయినా, ఆయన వినలేదు. వాస్తవానికి ఆయన రోజుకు 12 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాల్సి ఉండగా ఆరోగ్యం సహకరించని కారణంగా శుక్రవారం ఆరున్నర కిలోమీటర్లు మాత్రమే నడవగలిగారు.

శనివారం, ఆదివారం విశ్రాంతి తీసుకున్నారు. సోమవారం నుంచి మళ్లీ పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. అడుగు తీసి అడుగు వేయలేక పోతున్న ఆయన యాత్ర ఎలా చేస్తారోనని నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడిచే దూరాన్ని తగ్గించి, రాత్రి బస సంఖ్య పెంచి పాదయాత్రను విశాఖపట్నం వరకు కొనసాగిస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు.