April 15, 2013

బహిరంగ చర్చకు సిద్ధమా?ముఖ్యమంత్రికి చంద్రబాబు సవాల్

ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై
వారికేం చేశారో చెప్పగలరా?
కాంగ్రెస్ పాలనలో రూ.21,747 కోట్లు మళ్లింపు
సబ్‌ప్లాన్ నిధుల వినియోగంలో సర్కారు మోసం
సామాజిక న్యాయానికి కట్టుబడ్డాం
ఎన్టీఆర్ హయాంలోనే చర్యలు చేపట్టాం: బాబు
బడుగువర్గాలను మభ్యపెడుతోందని సర్కారుపై ధ్వజం

నర్సీపట్నం(విశాఖ)  ఈ చట్టం రూపకల్పనకు తాము మద్దతునిచ్చామని, వైఎస్ఆర్ మాదిరిగా మోసం చేయకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరామని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి, సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని ప్రకటించారు. దళిత సంక్షేమం కోసం దేశంలోనే తొలిసారిగా కిలో రెండు రూపాయలకు బియ్యం, పక్కా గృహ నిర్మాణం, సబ్సిడీ ధరలకు చీర, ధోవతి విక్రయం వంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు దారి మళ్లించకుండా వారికే ఖర్చుపెట్టేవిధంగా చూసేందుకు ఎన్టీఆర్ హయాంలోనే 1986 మే 12నమెమో(నెం. 570 ఎస్‌సీపీ 11/81-1)ని జారీ అయిందని తెలిపారు.

అప్పట్లోనే తరచూ సమీక్షలు నిర్వహించి సబ్‌ప్లాన్ నిధుల వినియోగాన్ని క్రమబద్ధీకరించిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అయితే తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో మొత్తం రూ. 21,747 కోట్ల సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించి హుస్సేన్‌సాగర్ అభివృద్ధి, ఔటర్ రింగ్ రోడ్డు, వంతెనలు, అతిథి గృహాల నిర్మాణం, జంతు ప్రదర్శనశాల అభివృద్ధి, ఇడుపులపాయ ఎస్టేట్‌లో రహదారుల నిర్మాణానికి వెచ్చించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చంద్రబాబు విమర్శించారు. వైఎస్ హయాంలో నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసినా ఆచరణలో ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, ప్రస్తుత ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న సబ్‌ప్లాన్ చట్టం అమలు కూడా అదే రీతిలో ఉంటుందన్నారు.

తమ హయాంలో ఎస్సీలకు రిజర్వేషన్లను 14 నుంచి 16శాతానికి, ఎస్టీలకు 4 నుంచి 6 శాతానికి పెంచామన్నారు. ఉద్యోగ పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్‌లు అమలుచేసిన ఘనత తమకే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. మాయావతి ఒత్తిడి కారణంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ నిబంధన అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిందని వ్యాఖ్యానించారు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారని, ఎస్సీ వర్గీకరణలో మాదిగ, ఉపకులాలకు న్యాయం చేయడానికి తామెంతో శ్రమించామని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆ దిశగా కృషి చేయాలని అన్నారు.

సబ్‌ప్లాన్ చట్టం ఆమోదించిన తర్వాత కూడా 2012 డిసెంబర్ 14న జారీచేసిన జీవో నెం. 5671 ప్రకారం ఎనిమిది జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఈవీఎంల మరమ్మతుల కోసం కాంగ్రెస్ సర్కారు దారి మళ్లించిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు తామేం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, చేతనైతే కాంగ్రెస్ పాలకులు వారు చేసిన అభివృద్ధిని వెల్లడించేందుకు బహిరంగ చర్చకు సిద్ధమేనా అని ముఖ్యమంత్రికి చంద్రబాబు సవాల్ చేశారు. పవిత్రమైన అంబేద్కర్ జయంతి సందర్భంగా తాను చేస్తున్న ఈ డిమాండ్‌కు కాంగ్రెస్ పాలకులు సిద్ధం కావాలన్నారు.