April 15, 2013

బాబు యాత్ర ముగింపు సభకు భారీగా జనసమీకరణ

పర్యవేక్షణకు ముగ్గురు సీనియర్లు
పైలాన్ నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం
'సంతకాల సేకరణ' కార్యక్రమం పొడిగింపు

విశాఖపట్నం, హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం..' పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 27న చేపట్టిన బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. భారీగా జన సమీకరణ, పైలాన్ నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహనరావు, వైఎస్ చౌదరి(సుజనా)లకు అప్పగించింది.

వారిలో యనమల, గరికపాటి రెండురోజులుగా విశాఖలోనే ఉండి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. సభ నిర్వహణ కోసం పలు స్థానిక కమిటీలతో పాటు రాష్ట్రస్థాయి కమిటీలు ఉంటాయని యనమల చెప్పారు. 25వ తేదీ సాయంత్రానికి బహిరంగ వేదిక పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పైలాన్ కోసం గతంలో కేటాయించిన స్థలంపై వివాదం నెలకొన్నందున.. ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపికచేయాలన్నారు. పైలాన్ పనుల బాధ్యతను ఎమ్మెల్యే వెలగపూడికి అప్పగించారు.

నేతలతో బాబు టెలీ కాన్ఫరెన్స్..
విశాఖపట్నంలో చేపట్టిన బహిరంగ సభను భారీగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అయితే.. ఆ తర్వాత 28న కానీ, 29న కానీ హైదరాబాద్‌లో మరో బహిరంగ సభ నిర్వహించాలని తొలుత పార్టీ నేతలు భావించారు. కానీ, హైదరాబాద్‌లో బహిరంగ సభ కాకుండా చంద్రబాబును ఘనంగా స్వాగతించేందుకే పరిమితం కావాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. పార్టీ నేతలతో పాదయాత్ర స్థలి నుంచే చంద్రబాబు ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా ఆయా అంశాలు చర్చకు వచ్చాయి.

పండుగల సందర్భంగా విరామం రావడంతో వెనకపడిన.. 'సంతకాల సేకరణ' ఉద్యమాన్ని ఈ నెల 18 వరకు పొడిగించాలని నిర్ణయించారు. వాస్తవానికి 12నాటికే సంతకాల సేకరణ ముగిసింది. అయితే ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉండడం, జనం మమేకమవుతుండడం నేప«థ్యంలో 18 వరకు కొనసాగించాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు 'పల్లె పల్లెకు తెలుగుదేశం' కార్యక్రమాన్ని కూడా అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు.