April 15, 2013

టీడీపీ వర్గీయులపై కాంగ్రెస్,వైసీపీ నాయకుల దాడి

బత్తలపల్లి: మండలంలోని చెన్నరాయపట్నంలో కాంగ్రెస్, వైసీపీ నాయకులు ఏకమై టీడీపీ కార్యర్తలపై దాడికి దిగిన ఘటనలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని చెన్నరాయపట్నం గ్రామంలో ప్రతి ఏడాది ఉగాదిపర్వదినం తరువాత గ్రామంలోని సత్యమ్మదేవత ఆలయంలో గ్రామస్థులంతా జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఆదివారం కూడా జాతర జరుపుకున్నారు. ఉదయం ఆలయంలో సత్యమ్మకు జంతుబలులు ఇచ్చారు. వాటి చర్మాలు అమ్మే విషయంలో కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాదన చిలికిచిలికి గాలివానలా మారి ఘర్షణకు దారి తీసింది. ఉదయం 10.30 గంటల సమయంలో కాంగ్రెస్, వైసీపీ నాయకులు ఏకమై టీడీపీ వర్గీయులపై దాడికి దిగారు.

పరిస్థితి చేయిదాటకుండా గ్రామపెద్దలు కలుగజేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపివేశారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీడీపీ వర్గీయుడు నారాయణస్వామి ఒంటరిగా సత్యమ్మ ఆలయం వద్ద వెళ్తుండగా కాంగ్రెస్, వైసీపీ వర్గీయులు అతనని ధూషించారు. ఏరా పొద్దున నువ్వు, మీవాళ్లు చానా ఎగిరెగిరి గంతులేశారు అంటూ అతనిపై రాళ్లు రువ్వారు. అక్కడ నుంచి గొడవ మొదలైంది. గొడవ మొదలు కాగానే అడ్డుకోవడానికి టీడీపీ వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. అప్పుడు కాంగ్రెస్, వైసీపీ వర్గీయులు ఏకమై టీడీపీ వర్గీయులు రాములమ్మ, సాయమ్మ, లక్ష్మీనారాయణమ్మ, అంజినమ్మ, సత్యమయ్య, బాలసత్యమయ్య, నారాయణస్మామి, సతీశ్‌లను చితకబాదారు. ఘర్షణలో కాంగ్రెస్‌కు చెందిన లింగమయ్య, నరేష్, శ్రీనివాసులు ముగ్గురు మాత్రమే గాయపడ్డారు.

అప్రాచెరువులో ఉన్న టీడీపీ వర్గీయులు(గాయపడ్డవారి బంధువులు) వీరనారప్ప, చిన్న సత్యమయ్య ఘర్షణ విషయం తెలుసుకుని చెన్నరాయపట్నం వెళ్తుండగానే వైసీపీ, కాంగ్రెస్‌వర్గీయులు అప్రాచెరువులో వారిపై కూడా దాడికి దిగారు. గాయపడ్డవారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శాంతిలాల్ తన సిబ్బందితో చెన్నరాయపట్నంకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న టీడీపీ కార్యకర్తలను ఎంపీ నిమ్మల కిష్టప్ప, టీడీపీ జిల్లా ప్రధానకార ్యదర్శి వరదాపురం సూరిలు పరామర్శించారు. సూరి వెంట ఆకులేటి వీరనారప్ప, సంగాల సూరి, మాజీ తెలుగుయువత బోయపాటి ఈశ్వరయ్య, కృష్ణారెడ్డి, శ్రీనివాసులు ఉన్నారు.

కాంగ్రెస్, వైసీపీ దాడులను సహించం : సూరి కాంగ్రెస్, వైసీపీ నాయకులు టీడీపీ వర్గీయులపై దాడులు చేస్తే సహించేదిలేదని, వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కొంటామని జిల్లా ప్రధానకార్యదర్శి వరదాపురం సూరి పేర్కొన్నారు. మండల పరిధిలోని చెన్నరాయపట్నంలో టీడీపీవర్గీయులపై కాంగ్రెస్, వైసీపీ వర్గీయులు దాడి చేసిన విషయం తెలుసుకున్న ఆయన బత్తలపల్లికి వచ్చి బాధితులను పరామర్శించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఎస్ఐ లేకపోవడంతో సీఐ నరసింగప్పతో ఫోన్‌లో మాట్లాడారు. మహిళలపై కాంగ్రెస్, వైసీపీ వర్గీయులు దాడి చేశారని పేర్కొన్నారు.

అనంతరం స్టేషన్ బయటకు వచ్చి విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, వైసీపీలు రెండూ కుమ్మక్కై తమపార్టీ కార్యకర్తలపై దాడిచేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, మహిళలు అని కూడా చూడకుండా చితకబాది అత్యాచారం చేయడానికి ప్రయత్నించారన్నారు. యల్లనూరు, పుట్లూరు సంస్కృతిని కాంగ్రెస్, వైసీపీ నాయకులు ఇక్కడికి తెస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సంగాల సూరి, బోయపాటి ఈశ్వరయ్య, శ్రీనివాసులు, ఆకులేటి వీరనారప్ప, కృష్ణారెడ్డి ఉన్నారు.