April 15, 2013

తొమ్మిదేళ్ల పాలనలోని అవినీతిపై చర్చకు వస్తావా? సీఎం కిరణ్‌కు చంద్రబాబు సవాల్..

సమస్యలు లేవని నిరూపిస్తే..
రాజకీయాల నుంచి తప్పుకొంటా!
కిరికిరి రెడ్డే కాదు.. అబద్ధాల కోరు కూడా
కేబినెట్‌లో 90 శాతం అవినీతిపరులే..
సబ్ ప్లాన్‌లో మాదిగలకూ చోటు: బాబు
విశాఖపట్నం/నాతవరం : కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరి ముఖ్యమంత్రే కాక, అబద్ధాలకోరు కూడానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. విశాఖ జిల్లా నాతవరం మండలం శృంగవరంలో ఆయన పాదయాత్ర ప్రారంభించారు. కాళ్లనొప్పులతో రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన..సోమవారం సాయంత్రం నడకను పునః ప్రారంభించారు. గాంధీనగరం, తాండవ జంక్షన్, డీ ఎర్రవరం మీదుగా యాత్ర సాగించారు. మార్గమధ్యంలో పలుచోట్ల కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

"ఈసారి ఎన్నికలు మనకు ఆఖరి అవకాశం. అందుకే ప్రతి కార్యకర్తా సైనికుని మాదిరిగా పనిచేయాలి'' అని శ్రేణులకు పిలుపునిచ్చారు. కాలినొప్పి అధికం కావడంతో శృంగవరం నుంచి గాంధీనగరం వచ్చేలోగా రెండుసార్లు విశ్రాంతి తీసుకున్నారు. డాక్టర్ భరత్ ఆయనకు ఫిజియోథెరపీ చేశారు. కాగా, తొమ్మిది సంవత్సరాలుగా నిద్దరపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీలు గుర్తుకువచ్చారా అని గాంధీనగరంలో జరిగిన సభలో ఘాటుగా ప్రశ్నించారు. వారికి కేటాయించిన నిధులు, భూములు, ఇతర సౌకర్యాలను దిగమింగి ఇప్పుడు సబ్‌ప్లాన్ అంటూ నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సబ్‌ప్లాన్ పరిధిలో మాదిగలను కూడా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తొమ్మిది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. కేబినెట్‌లో 90 శాతం మంది మంత్రులు అవినీతిపరులుగా ముద్రపడ్డారని పేర్కొన్నారు. నిత్యావసర ధరలను గణనీయంగా పెంచి ఒక్కొక్క కుటుంబం నుంచి మూడు వేల రూపాయలకు పైగా ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రభుత్వం 'అమ్మ హస్తం' పేరుతో 185 రూపాయలకు తొమ్మిది రకాల సరుకులు అంటూ మోసం చేస్తున్నదన్నారు.

" నేను ప్రజల కష్టాలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేస్తున్నాను. ముఖ్యమంత్రి కూడా నాతో పాటు రావాలి. ప్రజలకు సమస్యలు లేవని అప్పటికీ ఆయన నిరూపించగలిగితే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా''నని సవాల్ చేశారు. తమ హయాంలో తొమ్మిది డీఎస్సీల ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, అయితే ప్రస్తుత ప్రభుత్వం రిక్రూట్‌మెంట్‌ల పేరుతో ఉద్యోగాలను అమ్ముకుంటున్నదని శృంగవరం సభలో విమర్శించారు.

వైఎస్ అవినీతికి పాల్పడుతున్నప్పుడు సోనియాగాంధీ చర్య తీసుకొని ఉంటే ఇన్ని ఇబ్బందులు తలెత్తివికాదన్న ఆయన.. తప్పుచేస్తున్న కొడుకును కన్నతల్లిగా విజయలక్ష్మి మందలించకపోవడం వల్లనే ఆయన ఈరోజు జైల్లో గడపాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చాక, కేంద్రం సహకారంతో పింఛన్లను 200 నుంచి 600కు పెంచుతామని, కౌలు రైతులకు కూడా వడ్డీలేని పంటరుణాలు అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మద్యం బెల్టుషాపుల రద్దుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అలాగే..మత్స్యకారులకు ప్రత్యేకంగా ఒక ప్యాకేజీ రూపొందించనున్నట్టు ప్రకటించారు. దీన్ని ఎన్నికల మానిఫెస్టోలో పొందుపరుస్తామని వెల్లడించారు. శృంగవరంలో సోమవారం ఆయన పాయకరావుపేట నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు.

పార్టీ ఆవిర్భావం నుంచి అండగా వున్న మత్స్యకారులకు అన్నివిధాలా గుర్తింపు ఇస్తామని, న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు దామాషా ప్రాతిపదికన అన్ని సదుపాయాలు కల్పిస్తామని, ఈ అంశాన్నీ మానిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేముందు ఆయా ప్రాంతాల కార్యకర్తల నుంచి ఎస్ఎంఎస్‌ల ద్వారా అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. ప్రభుత్వంలో అవినీతిని ఎండగట్టడంలో భాగంగా, సమాచారహక్కు చట్టం కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు, దానికి విశాఖపట్నంతోనే శ్రీకారం చుడతామని చెప్పారు. రాష్ట్రంలో కొద్దికాలంగా నాయకులు 'ఆయారామ్! గయారామ్' మాదిరిగా పార్టీలు మారుతున్నారని వ్యాఖ్యానించారు. నాయకులు వెళుతున్నా కార్యకర్తలు పార్టీలోనే ఉంటున్నారన్నారు.