April 15, 2013

ఇదేనా ఆ 'నిర్మల' గ్రామం!

ఇదేనా 'నిర్మల్' పురస్కారం పొందిన గ్రామం? ఈ చెత్తకుప్పలు, ఆ పేడదిబ్బలు.. ఇదేనా ఒకనాడు ప్రపంచాన్ని ఆకర్షించిన పరమ పరిశుద్ధ గ్రామం. ఈ మురుగ్గుంటలు, మరుగుదొడ్లు కూడా లేని ఆ నివాసాలు..ఇదేనా కేంద్రం మెప్పు పొందిన గొప్ప గ్రామం..అప్పటి శృంగవరానికి ఇప్పటి ఈ గ్రామానికి ఎంత తేడా! అసలు పోలికే లేదు. మరుగుదొడ్ల నిర్మాణంలో ఈ గ్రామం సాధించిన రికార్డులు ఏమయ్యాయి? ఇప్పుడు లెట్రీన్లు లేని ఇళ్లే ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది.

రహదారుల నుంచి నీటి కుంటల దాకా నాడు ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తే.. ఇప్పుడు అవన్నీ అవినీతి కంపు కొడుతున్నాయి. రోడ్ల పక్కన ఆహూతులను ఆహ్లాదపరిచే పచ్చటి మొక్కల జాడ ఎక్కడా కనిపించడం లేదు. బాగున్న ఊరిని బజారులో పెట్టింది ఎవరు? పంచాయతీరాజ్ సంస్థలకు సకాలంలో ఎన్నికలు జరపని పాలకులదే ఈ పాపం. ఆలన చూడాల్సిన పంచాయతీ వ్యవస్థలు లేవు.

చేనేత కాలనీలో తిరుగుతుండగా ఓ నేతన్న ఎదురయ్యాడు. "మా బతుకులు చూడయ్యా ఎలాగయ్యాయో! చినుకు పడితే ఈ ప్రాంతమంతా మునిగిపోతుంది. మా పనీ ఆగిపోతుంది. ఎంత చెప్పినా, ఎన్ని పిటిషన్లు పెట్టినా పట్టించుకున్న వారే లేరు'' అంటూ ఆయన దిగాలు పడ్డారు. ఈ సర్కారు మునిగిపోతే తప్ప మాకీ ముప్ప తప్పదని ఆ పక్కనే ఉన్న ఓ నడివయస్కురాలు శాపనార్థాలు పెట్టింది. అది వట్టిశాపమే కాదు.. పాలకుల పాపం పండిందని చేసే హెచ్చరిక కూడా!
పాలన చేయాల్సిన గ్రామ పాలకవర్గాలు లేవు. గ్రామీణ పాలనావ్యవస్థను కూల్చేయడంతో గోడు చెప్పుకోవడానికి గోడ తప్ప గవర్నమెంట్ అధికారి లేడు. ఎక్కడ సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. పల్లెల వైపు కన్నెత్తి చూసే నాథుడే కరువయ్యాడు.