April 15, 2013

బాబు యాత్ర భళా..!

'చంద్రబాబు శ్రమ వృథా కాదు. కాళ్లు, కండరాల నొప్పి తీవ్రంగా ఉన్నా.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో అలుపెరుగక ఆరేడునెలలుగా తిరుగుతున్న అధినేత యాత్రతో జిల్లాలో పార్టీ బలోపేతమైంది. ఈ బలంతో స్థానిక ఎన్నికల్లో ఎదురులేని విజయాలు సాధించాలి..'' అంటూ టీడీపీ నేతలు ఉద్యుక్తులవుతున్నారు. జిల్ల్లాలో చంద్రబాబు 24 రోజులపాటు చేసిన పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది. చంద్రబాబును చూసేందుకు, ఆయన ప్రసంగాలు వినేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. మొత్తం 11 నియోజకవర్గాల్లో చంద్రబాబు యాత్ర సాగింది.

ఒకటి, రెండు చోట్లమినహా మిగిలిన చోట్ల చంద్రబాబు పాదయాత్ర, సభలు సక్సెస్ అయ్యాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ పాదయాత్ర బాగా ఉపకరిస్తుందని టీడీపీ నేతలు ఆనందంతో ఉన్నారు. ఈ 24 రోజులూ చంద్రబాబు వెంటే నడిచిన నేతలూ కొంతమంది ఉన్నారు. వారు పాదయాత్ర సందర్భంగా జిల్లాలో పార్టీ స్థితిగతుల గురించి చంద్రబాబు దృష్టికి కూడా కొన్ని విషయాలు తీసుకువెళ్లారు.

సమీక్షల్లో స్పష్టత:

జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు స్వయంగా చంద్రబాబు నిర్వహించారు. నాయకులెవరినీ మాట్లాడనీయకుండా.. కార్యకర్తలకే అవకాశం కల్పించారు. దీంతో ఆయా నియోజకవర్గాలు, జిల్లాలో పార్టీ పరిస్థితి చంద్రబాబుకు చాలా వరకు అవగతమైంది. సమీక్షలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు లోటుపాట్లను సరిదిద్దుకోవాలని ఇక్కడ నేతలకు సూచించారు.

సూచనలు, సలహాలకు అవకాశం:

గతంలో ఎన్నడూలేని విధంగా పార్టీ అధినేత కార్యకర్తల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. చెప్పడానికి అవకాశంలేని వారి నుంచి లిఖితపూర్వకంగా తీసుకున్నారు. విలువైన సూచనలు చేసిన కార్యకర్తల పేర్లతో సహా చంద్రబాబు సమీక్షా సమావేశాలలో, సభలలో ప్రస్తావించారు. దీంతో తమ సూచనలకు విలువ ఇచ్చారని కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు.

గ్రామస్థాయి నుంచి పటిష్టం:

చంద్రబాబు పాదయాత్ర హుషారులో ఉన్న టీడీపీ నేతలు.. ఈ జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నారు. గ్రామాల్లో వార్డులవారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని, లోటుపాట్లను సమీక్షించుకుని పార్టీని పంచాయతీ ఎన్నికలనాటికి మరింత బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.