April 15, 2013

తిరుపతిలో టీడీపీ నేతల ముందస్తు అరెస్టు, విడుదల

  తిరుపతి: కార్వేటినగరంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 'ఇందిరమ్మ కలలు' సభను అడ్డుకుంటారనే ఉద్దేశ్యంతో ఆదివారం తిరుపతిలో టీడీపీ నేతలను ముందుజాగ్రత్తగా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సభ ముగిశాక విడుదల చేశారు. తొలుత నగరి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ను పోలీసులు అరెస్టుచేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగు మహిళ, యువత జిల్లా అధ్యక్షులు పుష్పావతి, శ్రీధర్‌వర్మ, టీఎస్ఎన్వీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస చౌదరి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, టీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవినాయుడు, నేతలు నరసింహయాదవ్, బి.ఇందిర, మందలపు మోహన్‌రావు, ఆర్‌సీ మునికృష్ణ, దంపూరి భాస్కర్‌యాదవ్, శేషాద్రి, రాజారెడ్డి, కేశవులు నాయుడు, సూరా సుధాకర్‌రెడ్డి, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గుండయ్య, బాలాజి నాయుడు తదితరులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు రెండు గంటల పాటు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఒక వైపు ఆందోళనలు, మరో వైపు నినాదాలతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.. పెంచిన కరెంటు చార్జీలను రద్దు చేసి, సరఫరా మెరుగ్గా ఇవ్వాలని డిమాండు చేశారు. నల్లబెల్లంపై ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం బంగాళాఖాతంలో కలసిపోవడం ఖాయమని జోస్యం చెపాఆ్పరు. నల్లబెల్లంపై నిషేధం ఎత్తివేయకుంటే రైతులు, హమాలీలు, కూలీలకు మద్దతుగా చిత్తూరులో నిరవధిక ఆందోళనకు దిగతామని ఎంపీ శివప్రసాద్ ప్రకటించారు.

అరెస్టయిన వారిలో ఇంకా రజనీకాంత్ నాయుడు, బుల్లెట్ రమణ, మాల్యాద్రి, రామమోహన్, ఆనంద్, సదాశివరెడ్డి, బాలాజి నాయుడు, శివప్రసాద్, మస్తాన్ నాయుడు, లోకేష్, సతీష్, ఊట్ల సురేంద్రకుమార్, సంపూర్ణమ్మ తదితరులున్నారు. సీఎం సభ ముగిశాక (నాలుగు గంటల తర్వాత) వీరిని వదిలిపెట్టారు. కాగా, అరెస్టయిన టీడీపీ నేతలకు సీపీఐ నాయకులు రామానాయుడు, మురళి మద్దతు ప్రకటించారు. టీడీపీ చేపట్టే ఆందోళనలకు మద్దతిస్తామన్నారు.