April 14, 2013

అవినీతి మంత్రులను అసహ్యించుకుంటున్న ప్రజలు

లబ్బీపేట: ప్రభుత్వంలోని మం త్రులందరూ అవినీతిలో కూరుకుపోవడాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ అన్నారు. చంద్రబాబు పాదయాత్రను చూస్తే జాలేస్తుందని మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ హయాంలో వివాదాస్పద జీవోలు జారీ చేసి జగన్‌కు సహకరించారంటూ జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఆరోపణలెదుర్కొంటున్నారని, ఓ మంత్రి జైలు ఊచ లు లెక్కిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఏకంగా హోం మంత్రిపై చీటింగ్ కేసు, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి పార్థసారథిపై ఏకంగా కోర్టు జైలు శిక్ష, వాక్స్ వాగన్ నుంచి సారా కుంభకోణం వరకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రి దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ తదితరులపై వున్న అభియోగాల చిట్టా విప్పితే సిగ్గుతో తలదించుకుంటారన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలో అధికారులు, ఐఏఎస్ అధికారులు పరిపాలనను చీదరించుకుంటున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ 2700 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును విమర్శించే హక్కు కాం గ్రెస్ నాయకులకు లేదన్నారు. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పే సాక్ష్యాన్ని నమోదు చేసి తద్వారా మిగిలిన మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు.

ప్రభుత్వమే జగన్‌ను కాపాడుతోందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జైలులో జగన్ సమీక్షలు, ములాఖత్‌లు నిర్వహించడం వెనుక ప్రభుత్వ సహకారం లేదా అని ప్రశ్నించారు. ఇకపై ఎదుటి వారిపై బురద చల్లడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు గొట్టిపాటి హితవు పలికారు. సమావేశంలో టీడీపీ నాయకులు చిరుమామిళ్ల సూర్యం, కోలుకొండ వెంకటేశ్వరరావు, కొత్తా నాగేంద్రకుమార్, పొనుగుమాటి శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.