April 14, 2013

యువతకు చేయూత

నర్సీపట్నం:జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్రలో జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతల తనయులు కీలకపాత్ర పోషించారు. పార్టీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయులు రత్నాకర్, విజయ్‌బాబులు ఇరువురూ పాదయాత్ర తొలిరోజున చంద్రబాబుకు అండగా కుడిఎడమలుగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. వీరభద్రరావు తనయుడు రత్నాకర్‌కు ఇటీవలె గ్రామీణ జిల్లా పార్టీ అధ్యక్షత బాధ్యతలను అప్పగించగా, అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్‌బాబుకు త్వరలో తెలుగు యువత రాష్ట్ర బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శుక్రవారం పాదయాత్ర ప్రారంభం నుంచి ముగిసేంతవరకు విజయ్, రత్నాకర్‌లు చంద్రబాబు వెన్నంటి వున్నారు. పాదయాత్రలో సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు, పప్పల చలపతిరావు రెడ్డి సత్యనారాయణ, అప్పలనర్సింహరాజు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కేఎస్ఎన్ఎస్‌రాజు, రామానాయుడు వంటి నేతలు పాల్గొన్నా వారెవరూ చంద్రబాబు వెంట ఎక్కువగా కనిపించలేదు. అయితే ఇరువురు యువనేతలు చంద్రబాబుకు అంటిపెట్టుకొని ఉండడం గమనార్హం.

చంద్రబాబు సైతం వారిరువురితోనే ఎక్కువగా చర్చిస్తూ వారిచెప్పిన సమాచారాన్ని వింటూ బహిరంగసభల్లో వేదికపైకి ఆహ్వానిస్తూ తగు ప్రాధాన్యం కల్పించారు. రానున్న ఎన్నికల్లో యువతకు అవకాశాలు కల్పిస్తామనడానికి సూచనగానే చంద్రబాబునాయుడు జిల్లాలో ఇరువురు సీనియర్ నేతల కుమారులకు తగు ప్రాధాన్యం ఇచ్చినట్టు భావిస్తున్నారు. వీరిరువురి బాటలోనే మరికొందరు నాయకుల వారసులు కూడా రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం అవుతున్నది. అయితే వీరిలో కొంతమందికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు లభించవచ్చునని పార్టీ వర్గాల సమాచారం.

ఇటీవల కాలంలో పార్టీపరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చంద్రబాబునాయుడుతో జిల్లాకు చెందిన సీనియర్ నేతలు దాడి వీరభద్రరావు, అయ్యన్నపాత్రుడులకు మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్సీ పదవి విషయంలో దాడి అసంతృప్తితో వున్నారు. శుక్రవారం ప్రారంభమైన పాదయాత్రలో కూడా ఆయన పాల్గొనలేదు. అయితే శనివారం నాటికి కొంత మెత్తబడిన ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. ఇక ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పెందుర్తిలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అప్పట్లో అయ్యన్నపాత్రుడు పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే జిల్లాకు సంబంధించి చంద్రబాబునాయుడుతో పార్టీపరంగా తీసుకున్న నిర్ణయాలపై విభేదించిన ఇరువురు సీనియర్ నేతల కుమారులే శుక్రవారం చంద్రబాబు పాదయాత్రలో ప్రముఖ పాత్ర పోషించడం గమనార్హం.