April 14, 2013

అవసరమైతే పాదయాత్రలో మార్పులు

నర్సీపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నా... మీకోసం పాదయాత్రలో పరిస్థితులకనుగుణంగా అవసరమైతే మార్పులు చేపడతామని టీడీపీ పొలిట్‌బ్యూరో మెంబర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడుతూ తీవ్రమైన కాళ్లనొప్పితో బాధపడుతున్న చంద్రబాబుకు రెండురోజుల విశ్రాంతి అవసరమని వైద్యనిపుణులు సిఫార్స్ చేయడం వల్లే పాదయాత్రను నిలుపుచేశామన్నారు. తొలిరోజున 12 కిలోమీటర్లకు బదులు కేవలం ఆరున్నర కిలోమీటర్లు నడవడంతో శృంగవరంలో రాత్రిబస ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. 15వ తేదీ రాత్రి డి.ఎర్రవరంలోనూ, 16వ తేదీన బలిఘట్టంలోనూ, 17వ తేదీన కొండలఅగ్రహారంలోనూ చంద్రబాబు రాత్రి బస ఉంటుందని, అయితే వైద్యనిపుణుల సూచనలు, ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైతే ప్రతీరోజూ నడిచే దూరాన్ని తగ్గించి రాత్రిబసలు పెంచుతామని చెప్పారు.

పెండింగ్ ప్రాజెక్టులపై నివేదిక


రెండున్నర దశాబ్దాలపాటు నర్సీపట్నం నియోజవకర్గ ప్రతినిధిగా కొనసాగిన తన హయాంలో ఇంకా చేపట్టవలసిన పెండింగ్ ప్రాజెక్టులపై ఒక నివేదికను రూపొందించి చంద్రబాబునాయుడుకు అందజేయనున్నామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినవెంటనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని, ఇదే విషయాన్ని నర్సీపట్నంలో చంద్రబాబు ద్వారా ప్రకటింపజేస్తామని అన్నారు.

16న పేటపై సమీక్ష

విశ్రాంతిలో ఉన్న చంద్రబాబు ఆదివారం కొద్దిసేపు మాత్రమే అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారని, ఇందుకోసం శృంగవరంలోనే ఏర్పా ట్లు చేశామన్నారు. మంగళవారం మధ్యాహ్నం డి.ఎర్రవరంలో పాయకరావుపేట నియోజవకర్గ రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారని, బుధవారం బలిఘట్టంలో నర్సీపట్నం నియోజవకర్గంపైన, గురువారం కొండలఅగ్రహారంలో పాడేరు నియోజవకర్గ పరిస్థితులపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందన్నారు.