March 13, 2013

నీతి తప్పను!- చంద్రబాబు

ఏలూరు ,పాలకొల్లు : బహుదూరపు బాటసారి చంద్రబాబు ' నేను నీతి తప్పను అని ఒట్టేశారు. నీతి, నిజాయితీలకు కట్టుబడతానని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు తుడిచేందుకు శారీరక కష్టాలు లెక్కచేయనని ప్రకటించారు. కాంగ్రెస్‌పై తుదివరకు పోరాడతానంటూ ప్రజల ముందు భరోసా ఇచ్చారు. చీకటి రాజకీయాలను గమనించండి అంటూ ప్రజలను చైతన్యపరిచారు. 'వస్తున్నా.. మీకోసం' యాత్రలో భాగంగా ఆయన బుధవారం 163వ రోజైన బుధవారం 12 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు. జనం మధ్య ఆయన యాత్ర ఉత్సాహంగా సాగింది. గడిచిన నాలుగు రోజుల కంటే ఐదవ రోజు అయిన బుధవారం ఆయన బహిరంగ సభల్లో ప్రత్యర్థి పార్టీలపై స్వరం పెంచి మాట్లాడారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై నేను సహకరించాలా, వద్దా అంటూ పాలకొల్లులో కీలక ప్రశ్నను ప్రజల ముందుంచి కొత్తదనం చూపించారు.

వద్దువద్దూ అంటూ జనం నుంచి వచ్చిన సమాధానం రాబట్టడం ద్వారా తన మార్గం సరైందే అన్నట్లుగా నేరుగానే బహిర్గతం చేశారు. పూలపల్లి, రైల్వేస్టేషన్ సెంటర్, ఎన్‌టీఆర్ సెంటర్ ఆయన టీఆర్ఎస్‌పైనా, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీల తీరుపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ జోలికి వస్తే మాడి మసైపోతారంటూ హెచ్చరించారు. ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. ఒకప్పటి గోదావరి తీరం ఎంత హాయిగా ఉండేది, ఇప్పుడెంత కలుషితంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మునపటి మాదిరిగానే గోదావరి తీరంను బంగారం చేస్తానని, రైతులకు అండగా ఉంటానని రైతులకు ధైర్యాన్ని ఇచ్చారు. కాలువలు కలుషితమయ్యాయి. తాగడానికి నీరు లేకుండా పోయింది, ఇదేమి పాలనా అంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కరెంటు కష్టాలన్నీ తొలగాలంటే అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మేము ఏదైనా అనుకుంటే అది పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టమని తమ ధోరణిని ప్రజలకు వివరించే ప్రయ త్నం చేశారు.

శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విజ్జేశ్వరం నుంచి సాగునీటి పథకాలు అమలుకు భారీ ఖర్చు చేసినా రైతులకు ఏమి ఒరగబెట్టలేకపోయారని దుయ్యబట్టారు. గోదావరి గట్టు ఆధునీకరణ పనులు ఏమైయ్యాయంటూ నిలదీశారు. నరసాపురం బ్యాంకు కెనాల్ పరిస్థితి అధ్వానంగా ఉంది, కాలువలు ఆధునీకరణ అన్నారు దాని సంగతి ఏమైందని నిగ్గతీశారు. అంతకుముందు పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా తాను వరుసగా తన నియోజకవర్గంలో ఎలా గెలుపొందుతూ వచ్చానో వివరించే ప్రయత్నం చేశారు. ఆరు నెలలకో, సంవత్సరానికో ఒకసారి నా నియోజకవర్గానికి వెళతాను.. కాని అక్కడ నా కార్యకర్తలంతా నిత్యం కష్టపడతారు. ప్రజలతో ఉంటారు. నాకు ఎంత మెజార్టీ ఇస్తారో ముందుగానే లెక్క చూపెడతారు. సరిగ్గా ఒక వెయ్యి అటో ఇటో మెజార్టీ మాత్రం ఖాయం అంతలా అక్కడ కష్టపడుతున్నారు. మీరు కూడా అలాగే కష్టపడితే మనకు 294 స్థానాలు మనవేనంటూ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నూరుపోశారు.

అలాగే ఉద్యోగులను తమతో కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. 5వ రోజు తన పర్యటనలో ఎక్కువగా ప్రజా సమస్యలతో రాజకీయ పరిణామాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. కరెంటు సమస్యలను ప్రస్తావించడంతో పాటు కరెంటు లేని లోటు పేద వర్గాలను కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును బుధవారం ఎమ్మెల్సీ శమంతక మణి, మాజీ స్పీకర్ సూర్యనారాయణరాజు కలుసుకున్నారు.