March 13, 2013

బెయిల్ కోసం ఒకరు.. బ్లాక్‌మెయిల్ కోసం మరొకరు

'తోక'లు పట్టుకుని వేలాడం
టీడీపీకి ఆ ఖర్మ పట్టలేదు
ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు

ఏలూరు : "తోక పార్టీలను పట్టుకుని వేలాడే ఖర్మ మాకు పట్టలేదు. వాళ్లేదో అంటే మేము వాళ్ల వెంట వెళ్లాలా? టీఆర్ఎస్, వైసీపీలవి చీకటి రాజకీయాలు. ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు. వీళ్లకు మేం సమాధానం చెప్పాల్సిన పనిలేదు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ సర్కారుపై టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. తమను మద్దతు కోరడంపైన, వైసీపీ వ్యవహారాలపైన ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఆ తోక పార్టీలను పట్టుకుని వెళ్తే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టే ఉంటుందని ఆక్షేపించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో 'వస్తున్నా.. మీ కోసం' యాత్రలో భాగంగా పాలకొల్లు మండలం పూలపల్లిలో బస చేసిన ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎవరు ఏదైనా ప్రతిపాదించొచ్చు గానీ.. నీతి, నిజాయితీ ఉండాలని, అవిశ్వాసం పేరు పెట్టి సూట్‌కేసులతో ఎమ్మెల్యేలను కొనాలనుకునే ప్రయత్నానికి మేం మద్దతివ్వాలా అంటూ ప్రశ్నించారు. 'టీఆర్ఎస్‌కి, వైసీపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి? టీఆర్ఎస్‌ది బ్లాక్‌మెయిల్. అలాంటి నీతిమాలిన రాజకీయాలకు మా పార్టీ దూరం' అని చంద్రబాబు అన్నారు.

"ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరం మాకేముంది? మాపార్టీ వారికి ఏమైనా లెసెన్సులు ఇప్పించుకోవాలా, వీళ్ల మాదిరిగా దోచుకు తినాలా, ఇదేదీ మాకు అవసరం లేదు. ఉంటే, గింటే బెయిల్ కోసం వైసీపీ, బ్లాక్ మెయిల్ కోసం టీఆర్ఎస్‌లే ఆ పని చేయాలి'' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ముద్దు కృష్ణమ నాయుడు, అశోక్ గజపతిరాజు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

టీఆర్ఎస్, వైసీపీలు రాజకీయ వ్యభిచారులని, ఈ తోడుదొంగలిద్దరూ ఇప్పుడు కుమ్మక్కయ్యారని, వాటిని నమ్మి అవి పెట్టే అవిశ్వాసాలకు తాము మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. 'ఆ రెండు పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయం. ఆ పార్టీలను నమ్మి మేం వాటికి మద్దతిచ్చే ప్రశ్నే లేద'ని మోత్కుపల్లి అన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ ఓడిపోతామని భయపడి దాన్ని అడ్డుకోడానికి టీఆర్ఎస్, వైసీపీలు అవిశ్వాసం నాటకం ఆడుతున్నాయని ముద్దుకృష్ణమ అన్నారు. తగిన సమయంలో మా నిర్ణయం మేం తీసుకొంటామని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.